Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 శాతం మంది లబ్దిదారులకూ తయారీ కాని కార్డులు
- ఇప్పటి వరకు 22 కోట్ల మందికి మాత్రమే..!
న్యూఢిల్లీ : మోడీ సర్కారుకు పథకాలను ప్రచారం చేసుకొని రాజకీయంగా లబ్ది పొందటంపై ఉన్న శ్రద్ధ వాటి అమలుపై మాత్రం కనిపించడం లేదు. మూడేండ్ల క్రితం ప్రారంభమైన ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జేఏవై) విషయంలో మోడీ సర్కారు పేలవ పని తీరే ఇందుకు నిదర్శనం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 50 శాతం మంది లబ్దిదారులకు కూడా ఆయుష్మాన్ కార్డులు తయారు కాలేదు. దేశంలోని పలు మీడియా నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించాయి.భారత్‌లోని ప్రముఖ మీడియా సంస్థల కథనం ప్రకారం.. దేశంలోని అధిక జనాభాకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంగా పీఎం జేఏవైను కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం గురించి మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రచారమూ చేసుకున్నది. అయితే, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పథకం పని తీరు మాత్రం ఆశించినంతగా లేదు. కనీసం 50 శాతం మంది లబ్దిదారులకూ ఆయుష్మాన్ కార్డులు తయారు కాలేదు.
లబ్దిదారులు 54 కోట్లు.. ఆయుష్మాన్ కార్డులు 22.10 కోట్ల మందికి మాత్రమే..!
దేశవ్యాప్తంగా పథకంలో చేర్చబడిన రాష్ట్రాల్లో దాదాపు 54 కోట్ల మందికి ఆయుష్మాన్ కార్డులు తయారు చేయాల్సి ఉన్నది. 2011లో జరిగిన సామాజిక-ఆర్థిక జనగణనలో నమోదైన 10.74 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక కుటుంబంలో సగటున ఐదు మంది వ్యక్తుల ప్రకారం దేశంలో ఈ పథకం కింద లబ్దిదారుల సంఖ్య 53.7 కోట్లు. కానీ, దేశవ్యాప్తంగా ఈ పథకంలో ఉన్న రాష్ట్రాల్లో మొత్తం 22.10 కోట్ల మందికి మాత్రమే ఆయుష్మాన్ కార్డులు తయారైనట్టు తెలుస్తున్నది.
పథకంతో ఆ ఐదు రాష్ట్రాల ఓటర్లపై దృష్టి
బీజేపీయేతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ లు ఈ పథకంలో చేరలేదు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు.. కుటుంబ సభ్యులకు బదులుగా కుటుంబానికి ఒక కార్డును తయారు చేసే విధానాన్ని అనుసరించాయి. ఈ విధంగా 22.10 కోట్ల మంది లబ్దిదారులకే ఆయుష్మాన్ కార్డులు తయారయ్యాయి. కాగా, ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయంలో (పీఎంఓ) ఆయుష్మాన్ కార్డులకు సంబంధించి ఒక సమావేశం జరిగింది. అయితే, ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఆయుష్మాన్‌పై మోడీ సర్కారు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో అధికం
ఇక రాష్ట్రాల వారీగా కార్డుల తయారీ సంఖ్యను పరిశీలిస్తే.. ఛత్తీస్‌గఢ్ (82.5 శాతం), జార్ఖండ్ (65.9 శాతం), మధ్యప్రదేశ్ (61.5 శాతం) లు ముందు స్థానంలో ఉన్నాయి. చండీగఢ్ (57.4 శాతం), గుజరాత్ (51.2 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (46.1 శాతం), హర్యానా 36.2 శాతం, మహారాష్ట్ర (17.7 శాతం), బీహార్ (13.5 శాతం)తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇలా..
అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 5.75 కోట్ల మందికి కార్డులు తయారు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,76,17,984 మందికి మాత్రమే కార్డులు తయారయ్యాయి. గోవాలో 1.81 లక్షల మందికి గానూ 22 వేల మందికే కార్డులు తయారు చేశారు. మణిపూర్‌లో 13.60 లక్షల మందిలో 3.89 లక్షల మందికి, పంజాబ్‌లో 2.28 కోట్ల మంది లబ్దిదారులకు గానూ 77.41 లక్షలు, ఉత్తరాఖండ్‌లో 78 లక్షల మందిలో 41 లక్షల మందికి మాత్రమే కార్డులు తయారు చేయగలిగారు.