Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరి-కావేరి నదుల అనుసంధాన సమావేశంలో రాష్ట్రాలు
- శాస్త్రీయ అంచనాలతో గోదావరి జలాల లభ్యత మదింపు చేపట్టాలి : తెలంగాణ
- దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై తమకున్న హక్కులు గుర్తించాలి: ఆంధ్రప్రదేశ్
- ప్రత్యక్ష నీటి వాటా కేటాయించాలి: కర్నాటక
- తమకు ఎక్కువ నీటి కేటాయించాలి: తమిళనాడు
- తమిళనాడు వాదనలకు మద్దతు ఇచ్చిన పుదుచ్చేరి
- నదుల అనుసంధానంపై రాష్ట్రాలు పాత విధానం : జలశక్తి శాఖ అధికారులు
న్యూఢిల్లీ : గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై రాష్ట్రాలు పాత వాదనలే వినిపించాయి. తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలను, అభిప్రాయాలను స్పష్టపరిచాయి. నీటి వాటాలపై బలంగా తమ వాదనలు వినిపించాయి. తమకు అన్యాయం జరగకుండా అనుసంధానంపై ముందుకు వెళ్లాలని ఆయా రాష్ట్రాలు స్పష్టం చేశాయి. శుక్రవారం నాడిక్కడ శ్రమశక్తి భవన్ (జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం)లో గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. నదుల నీటి సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు రాష్ట్రాలు తమ అభ్యంతరాలను వివరించాయి. గోదావరి-కావేరి అనుసంధానంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అధికారులు రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.
రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును నిర్మించేందుకు అన్ని భాగస్వామ్య రాష్ట్రాల మద్దతు కోరేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 250 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. అన్ని వాటాదారు రాష్ట్రాల అభిప్రాయాలను, సూచనలను కోరేందుకు కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ను గతేడాది పంపింది.
గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను ప్రాధాన్యక్రమంలో చేపడతామని ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలు ఎప్పటిలానే తమ పాత వాదనలకే కట్టుపడి ఉన్నాయి.
దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై తమకున్న హక్కులు గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. మిగులు జలాలున్నట్టు తేలితే అనుసంధాన ప్రక్రియకు తమకు అభ్యంతరం లేదని తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద నుంచి కాకుండా పోలవరం నుంచి గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియ చేపట్టాలని కోరారు.
గోదావరి నదిలో నీటి లభ్యతపై పున్ణమదింపు చేయాలనీ, పాత లెక్కల ఆధారంగా నదుల అనుసంధాన ప్రక్రియను ప్రారంభించటం సరికాదని తెలంగాణ ప్రతినిధులు కోరారు. శాస్త్రీయ అంచనాలతో గోదావరి నదిలో జలాల లభ్యత మదింపు చేపట్టాలనీ, అనంతరం ఆయా రాష్ట్రాల వాటా తేల్చాలనీ, ఆ తరువాతే ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించి ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు. అనుసంధాన ప్రక్రియకు గోదావరిలో 75శాతం నీటి లభ్యతను కాక 50శాతం నీటి లభ్యతనే పరిగణనలోకి తీసుకోవాలనీ, నికరంగా తమ వాటా జలాలు తేల్చిన తరువాతే ఈ అంశంలో ముందుకు సాగాలని తెలంగాణ ప్రతినిధులు సూచించారు. తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ నీటిని కేటాయించాలని కోరారు. అనుసంధాన ప్రక్రియకు కేంద్రం రూపొందించిన అలైన్‌మెంట్‌ను మార్చాలని విజ్ఞప్తి చేశారు.
గోదావరి- కృష్ణా - పెన్నా-కావేరి అనుసంధానంతో తమకు ప్రత్యక్షంగా నీటి వాటాలు దక్కే పరిస్థితి లేనందున ప్రత్యక్షంగా వాటా కేటాయించాలని కర్నాటక ప్రతినిధులు కోరారు.
కావేరి నుంచి తగినంత నీటి లభ్యత లేకపోవడంతో తమ రాష్ట్రంలో సాగు, తాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి ఇబ్బందులు ఏర్పడుతున్నందున తమకు ఎక్కువ నీరు కేటాయించాలని తమిళనాడు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరిస్తూ త్వరగా అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని వారు కోరారు. తమిళనాడు వాదనలకు పుదుచ్చేరి ప్రతినిధులు మద్దతు తెలిపారు.
నదుల అనుసంధానంపై రాష్ట్రాలు తమ పాత విధానానికే కట్టుబడి ఉన్నట్టు జలశక్తి అధికారులు వెల్లడించారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌కు తమిళనాడు, పుదుచ్చేరి అంగీకరించినట్టు తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ నుంచి చీఫ్ ఇంజనీర్ (సిఈ) మోహన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) సుబ్రహ్మణ్య ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి, ఈఎస్సీ నారాయణ రెడ్డి, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఎన్‌డబ్ల్యూడీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.