Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ-ముస్లిం విభజనకు హిందూత్వ శక్తుల ప్రయత్నం
- బాధ్యతను మరిచిన కర్నాటక బీజేపీ ప్రభుత్వం : సామాజిక కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. దేశ రాజధాని నుంచి గల్లీ స్థాయి వరకు ఈ అంశం వ్యాప్తి చెందింది. అయితే, హిజాబ్ వివాదం వెనక హిందూత్వ శక్తుల హస్తమున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. స్వచ్ఛమైన మనసుతో ఉన్న విద్యార్థులలో మతం పేరుతో విషబీజాలు నాటి హిందూ-ముస్లిం మత విభజన తీసుకొచ్చారని తెలిపారు. అయితే, కర్నాటకలోని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం మాత్రం తన బాధ్యతను విస్మరిచింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని విశ్లేషకులు చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించకుండా బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ధిందన్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వ తీరు మతోన్మాద హిందూత్వ శక్తులకు తోడవడంతో కన్నడిగులలో విభజన చిచ్చు వచ్చిందని ఆరోపించారు. ముఖ్యంగా, బీజేపీ ప్రభుత్వ తీరు ముస్లిం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన మత స్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం నిరోధించిందని చెప్పారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా రాష్ట్రాన్ని పాలించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరద్ధంగా వ్యవహరించి ప్రజలలో విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఇలాంటి అసమానతను సృష్టించిన తర్వాత దానిని చల్లార్చడం చాలా కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అసమానత తాత్కాలికమే అయినప్పటికీ.. ఇది అవమానకరమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. ఇది తాత్కాలికంగా ఉండదని చెప్పారు. మతపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహారించాలన్న విషయాన్ని మరచి అందకు విరుద్ధంగా వ్యవహరించిన కర్నాటక ప్రభుత్వం ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సెక్యులర్ దేశంలో ప్రజల మతస్వేచ్ఛను హరిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బొమ్మై సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు వివరించారు. హిజాబ్ విషయంలో బీజేపీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరించిన తీరు అంతరార్జతీయ సమాజంలో భారత ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నద న్నారు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ హిజాబ్ అంశాన్ని కవర్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ఉటంకిం చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని రాజకీయం చేసి లబ్ది పొందేందుకే బీజేపీ ఈ ప్రయత్నాలను చేసిందని ఆరోపించారు. అయితే, బీజేపీ తన సిద్ధాంతాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నదని విశ్లేషకులు తెలిపారు. దేశంలో మెజారిటీ-సంస్కృతిని పెంచి పోషిస్తూ మైనారిటీలను అణచివేతను కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. ఇందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మైనారిటీలపై ఆ పార్టీ అగ్రనాయకుల నుంచి స్థానిక నాయకుల వరకు చేస్తున్న వ్యాఖ్యలు, వేదింపులే ఇందుకు నిదర్శనమన్నారు.