Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం
- ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి
- వైఖరి మారకుంటే బీజేపీకి ఇబ్బందులు తప్పవు : ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
- ముంబయిలో భేటీ అయిన ఇరువురు సీఎంలు
- బీజేపీవి మూర్ఖపు నిర్ణయాలు : శరద్పవార్తో గులాబీబాస్ సమావేశం
దేశంలో గుణాత్మక అభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా ఏ రంగంలో కూడా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి గత ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని వారు తెలిపారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తానంటూ ప్రకటించిన సీఎం కేసీఆర్... ఆదివారం ముంబయిలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ ఎంపీిలు, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి ఉదయం 11.45 గంటలకు ముంబయి బయలుదేరి వెళ్లారు. అక్కడి విమానాశ్రయం నుంచి నేరుగా మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు వెళ్లారు. కెసిఆర్ బృందానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు సీఎంలు సమా వేశమయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయకక్ష సాధింపు చర్యలు, మతం, భాష, దేశభక్తి ముసుగులో చేస్తున్న అరాచకాల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ అన్నారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యంచేసి ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపునకు వాటిని ఉపయోగిస్తుందని, ఈ దుష్ట పరంపరను అడ్డుకోకుంటే దేశానికి ప్రమాదమని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అనుసరించిన అప్రజాస్వామిక, అనైతిక చర్యలను ఉద్ధవ్ ఠాక్రే ఈసందర్భంగా ప్రస్తావించారు. విభజన శక్తుల నుంచి దేశాన్ని కాపాడేందుకు కేసీఆర్ చేస్తున్న కృషికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఠాక్రే హామీఇచ్చారు. ఇతర అంశాలపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎంను కేసీఆర్ హైదరాబాద్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిరువురూ వన్ టూ వన్ (ఏకాంతంగా) భేటీ అయ్యారు. ఆ తర్వాత ఠాక్రే కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్్... మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, జాతీయ స్థాయిలో జరగాల్సిన మార్పులపై చర్చించామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు ఆరంభం మాత్రమే.. మున్ముందు పురోగతి వస్తుందన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, రాష్ట్రాల పట్ల పక్షపాత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. పద్దతి మార్చుకోకుంటే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పబోవని కేసీఆర్ హెచ్చరించారు. శివాజీ, బాల్ ఠాక్రే వంటి యోధుల స్ఫూర్తితో మెరుగైన అభ్యుదయ దేశం కోసం రాబోయే రోజుల్లో పోరాడుతామన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు సంబంధించి అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామనీ, రాబోయే రోజుల్లో కలిసి పని చేసేందుకు నిర్ణయించినట్టు వివరించారు. త్వరలో హైదరాబాద్లో లేదా మరో చోట ప్రాంతీయ పార్టీల నేతలందరం కలిసి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు.. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దు వెయ్యి కిలోమీటర్లు ఉంది. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ... అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు.ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ మంచి బంధం ఉంటుందన్నారు. ఇదే బంధాన్ని దేశాన్ని ఏకం చేయడం కోసం ఉపయోగిస్తామన్నారు. దేశ హితం కోసం కెేసీఆర్తో కలిసి నడుస్తామని ఠాక్రే చెప్పారు. తమతో కలిసొచ్చే నేతలతో కలిసి విధాన పరమైన మార్పుల కోసం పోరాడుతామని స్పష్టంచేశారు. చర్చల్లో రహస్యమేమీ ఉండబోదనీ, మార్పు కోసం ఏదైనా బహిరంగంగానే చేస్తామన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయం నడుస్తోందనీ..అది దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఉద్ధవ్ స్పష్టం చేశారు.