Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 లక్షల జరిమానా
- దాణా కుంభకోణం కేసులో..
పాట్నా: బీహార్ రాష్ట్రాన్ని కుదిపేసిన దాణా కుంభకోణంలో ఆఖరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(73)కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేండ్లు జైలు శిక్ష ఖరారు చేసింది. రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. లాలూతో పాటు మరో 99 మంది నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని న్యాయస్థానం జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. గత మంగళవారం లాలూను దోషిగా తేల్చింది. మరో 46 మందికి కోర్టు మూడేండ్లు జైలు శిక్షను విధించింది. 24 మందిని నిర్దోషులుగా పేర్కొంది. రూ.950 కోట్ల దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూ ప్రసాద్‌కు జైలు శిక్షలు విధించింది. డొరండా ఖజానా కేసు చివరిది. నకిలీ బిల్లులతో రూ.139.5 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా పొందిన ఈ కేసులో మొత్తం 170 మందిపై సీబీఐ అభియోగాలను మోపింది. వీరిలో 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ మరో 99 మంది నిందితులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది.తీర్పు వెలువడిన వెంటనే లాలూకి బీపీ పెరిగింది. అక్కడ కూలిపోగా..ఆస్పత్రికి తరలించారు.