Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టును ఆశ్రయించిన లఖింపూర్ రైతులు
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేయాలని లఖింపూర్ ఖేరీ రైతులు కోరుతున్నారు. ఈ మేరకు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ రైతు కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. రైతులను జీపుతో తొక్కించినట్టు బలమైన సాక్ష్యాలు ఉన్నా.. నిందితుడు బెయిల్‌పై విడుదల కావడాన్ని రైతుల కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ద్వారా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి. ''హేయమైన నేర స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చార్జిషీట్లో నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. బాధితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా బలంగా ఉన్నాయి. నిందితుడు మరోమారు ఇలాంటి నేరాలకు పాల్పడమే అవకాశం ఉన్నది. అలాగే ఈ కేసులో సాక్ష్యాల్ని తారుమారు చేసే న్యాయమైన విచారణకు అడ్డపడుతుంది'' అని పిటిషన్లో రైతుల కుటుంబాలు పేర్కొన్నాయి.
జనవరి 18న బెయిల్ విచారణ నిమిత్తం తమ తరఫు న్యాయవాదికి అనుమతి లభించడకపోవడం వల్ల సమర్ధవంతమైన వాదనలు వినిపించలేక పోయామనీ, ఈ విషయమై కోర్టును పలుమార్లు ఆశ్రయించినప్పటికీ అవకాశం లభించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంలో విఫలమైనందున తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఆశిష్ మిశ్రా బెయిల్‌పై దాఖలైన రెండో పిటిషన్ ఇది. ఆయన విడుదలైన రెండు రోజుల తరువాత అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. అందులో పిటిషనర్లు సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నాయనే అభ్యంతరాలను లేవనెత్తారు.
గత ఏడాది అక్టోబర్ 3న మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను మిశ్రాకు చెందిన కార్లుతో తొక్కించిన ఘటన సందర్భంగా లఖింపూర్ ఖేరీలో ఎనిమిది మంది మరణించారు. ఈ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉద్దేశించిన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను రైతులను అడ్డుకున్నారు. ఆశిష్ మిశ్రా అరెస్టు తర్వాత, ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్థానిక కోర్టులో 5,000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. నవంబర్‌లో ట్రయల్ కోర్టు బెయిల్ కోసం అతని దరఖాస్తును తిరస్కరించింది. దీంతో మిశ్రా హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రాజీవ్ సింగ్ ఫిబ్రవరి 10న మిశ్రాకు బెయిల్ మంజూరు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను కొట్టిన వాహనం డ్రైవర్ తనను తాను రక్షించుకోవడానికి వాహనాన్ని వేగవంతం చేసే అవకాశం ఉందని పేర్కొంది.