Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమతాను కలవడానికి నిరాకరించిన కుటుంబ సభ్యులు
కొల్కతా : విద్యార్థి నాయకుడు అనీష్ ఖాన్ హత్యపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మట్లాడుతూ 'ఈ మరణంలో ఎవరి ప్రమేయం ఉన్నా విచారణ నిష్పాక్షపాతంగా సాగుతుంది. నేను బాధ్యత వహిస్తే, నేను కూడా తప్పించుకోలేను. ఇలాంటి విషయాల్లో నేను చాలా కఠినంగా ఉంటాను' అని తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం అనీష్ ఖాన్ కుటుంబసభ్యులతో కలవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు నిరాకరించడంతో సమావేశం జరగలేదు.
సోమవారం కేబినెట్ సమావేశం అనంతరం సిఐడి, అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో కలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేదికి మమతా ఆదేశాలు ఇచ్చారు.
శుక్రవారం రాత్రి పోలీసులమంటూ వచ్చిన నలుగురు వ్యక్తులు దౌర్జన్యంగా అమ్టాలో ఉన్న అనీష్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి అతన్ని తీసుకుని వెళ్లారు. కొద్ది సేపటికే అనీష్ మృత దేహం నివాసం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పడిఉంది. ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఎవ్వరిని పంపలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన తరువాత నుంచి అనీష్ ఖాన్ నివాసాన్ని తమ నిర్భంధంలోకి తీసుకున్నారు.
'నాపై నమ్మకం ఉంచాలని కుటుంబ సభ్యులను అభ్యర్థిస్తున్నాను. ఈ హత్యతో సంబంధం ఉన్నవారిని క్షమించం. ప్రభుత్వం నిష్పాక్షపాతంగా విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక అందచేస్తుంది' అని మమతా తెలిపారు.
అనీష్ ఖాన్ తండ్రి సలాం ఖాన్ మాట్లాడుతూ రాత్రిపూట తమ ఇంటికి వచ్చిన వ్యక్తుల్లో ఒకరు మమతా బెనర్జీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడని చెప్పారు. సోమవారం ముఖ్యమంత్రిని కలవాలని చెప్పినట్లు తెలిపారు. 'మాకు పోలీసులు అవసరం లేదు. వాళ్లు నా కొడుకును చంపేశారు. నన్ను కూడా హత్య చేస్తే...?, మా ఇంటి వద్ద పోలీసు బృందాన్ని తొలగించమని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాను' అని తెలిపారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా మాట్లాడుతూ అనీష్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా వారిని ముఖ్యమంత్రిని కలిసేందుకు తీసుకునివెళ్లారని చెప్పారు. 'ఆ కుటుంబం సిబిఐ విచారణను కోరుకుంటుంది. సిబిఐ విచారణతో అనేక ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. కాబట్టి మేం కూడా సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం కావాలి. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే పెద్ద ఉద్యమం జరుగుతుంది' అని మిశ్రా హెచ్చరించారు.