Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యం, మతస్వేచ్ఛపై సమాధానం చెప్పలేక ఎదురుదాడి
- వివాదాస్పదమవుతున్న మన విదేశాంగ విధానం
న్యూఢిల్లీ : మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల విషయంలో భారత్‌పై ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సరైన సమాధానం చెప్పుకోలేక..మోడీ సర్కార్ తంటాలుపడుతోంది. ఎదురుదాడికి దిగుతోంది. చివరికి ఇది మన ప్రభుత్వానికి ఎదురుగొడుతున్నాయి. విమర్శలపై భారత విదేశాంగ శాఖ వ్యవహారశైలి నవ్వులపాలవుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్, ఇతర ఉన్నతాధికారులు చేస్తున్న వ్యాఖ్యలు భారతదేశ ప్రతిష్టను, పరపతిని, నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్నాటకలో హిజాబ్ వివాదంపై అమెరికా అధ్యక్ష సలహాదారు రషీద్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. భారత్‌లో మత స్వేచ్ఛ దెబ్బతింటోందని రషీద్ హుస్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన వ్యాఖ్యల్ని భారత విదేశాంగ తీవ్రంగా తప్పుబట్టింది. హిజాబ్ వివాదం..కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నది. అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం..గతంలో భారత్‌లో మత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో మత స్వేచ్చ ప్రమాదంలో పడిందని తెలిపింది. దీనిని ''పక్షపాతం, దురుద్దేశపూరిత''వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. ఇక ఇటీవల సింగపూర్ ప్రధాని లీ సిన్ లూంగ్ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సింగపూర్ పార్లమెంట్ ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రధాని జవహర్లాల్ పాలనను కొనియాడారు. ఆనాటి పాలకుల విజన్, ప్రజాస్వామ్య విలువలు నేడు భారత్‌లో పూర్తిగా దెబ్బతిన్నాయని లీ సిన్ లూంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య భావనలు కనుమరుగు అవుతున్నాయని అన్నారు. భారత పార్లమెంట్లో సగం మందికి నేరచరిత్ర ఉందని అన్నారు. దీనిపై మోడీ సర్కార్ స్పందించిన తీరు విమర్శలపాలైంది. భారత్‌లో సింగపూర్ హైకమిషనర్‌ను పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేయటం..సరైన చర్య కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వివిధ దేశాల నుంచి వస్తున్న విమర్శలు, స్వచ్ఛంద సంస్థల నివేదికలపై పారదర్శకంగా వ్యవహరించాలి తప్ప, ఎదురుదాడితో తిప్పికొట్టడం సరైన స్పందన అనిపించుకోదని విశ్లేషకులు తెలిపారు. దేశంలో పలు ఎన్జీవోలపైనా మోడీ సర్కార్ చాలా అసహనం కనబరుస్తోందని, ఆక్స్‌ఫాం, ఆమ్నెస్టీ వంటి ప్రఖ్యాత సంస్థల నివేదికల్ని తప్పుబడుతోందని వారు అన్నారు. మానవ హక్కులపై అమెరికా కంట్రీ రిపోర్ట్, ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్, ఫ్రీడం హౌస్, వి-డెమ్ ఇనిస్టిట్యూట్, ఓపెన్ డోర్స్ వరల్డ్ వాచ్ లిస్ట్...మొదలైన వాటిపైనా భారత్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. కాశ్మీర్‌పై హ్యూందారు చేసిన ట్వీట్‌ను కూడా మోడీ సర్కార్ సహించకపోవటం..చర్చనీయాంశమైంది. ఇంటా బయటా భారత్‌పై వస్తున్న విమర్శలకు తట్టుకోలేక.. మోడీ సర్కార్ స్పందిస్తున్న తీరు నవ్వులపాలవుతోందని నిపుణులు చెబుతున్నారు.