Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందు 12 పిటిషన్లు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో నేటి నుంచి విచారణ ప్రారంభం కానున్నది. హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రతిపక్ష నేతలు, మాజీ న్యాయమూర్తులపై మోడీ సర్కార్ చట్టవ్యతిరేకంగా నిఘా కార్యకలాపాలకు పాల్పడిందని అనేకమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో దాదాపు 12 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌దారుల ఆరోపణలపై ఇప్పటికే మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో ఒక టెక్నికల్ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, పెగాసస్‌కు సంబంధించి సాంకేతిక అంశాల్ని లోతుగా పరిశీలించాల్సిందిగా కమిటీకి బాధ్యతను అప్పజెప్పారు. మోడీ సర్కార్ పెగాసస్‌ను కొనుగోలు చేసిందని, ఇందుకోసం పెద్దమొత్తంలో చెల్లింపులు చేసిందని 'న్యూయార్క్ టైమ్స్' కొద్ది రోజులక్రితం వార్తా కథనం వెలువరించింది. వీటిపై విచారణకు ఆదేశించాలని న్యాయవాది మనోహర్ లాల్‌శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈపిటిషన్ కూడా బుధవారం విచారణకు రానున్నది. పెగాసస్ కుంభకోణంపై సీజేఐ ఎన్.వి.రమణ, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. కేంద్రం పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయకపోవటంతో దీనిపై గత ఏడాది అక్టోబర్‌లో టెక్నికల్ కమిటీని ఏర్పాటుచేసింది. దేశ సార్వభౌమత్వం, జాతీయ భద్రత కారణాలరీత్యా అన్ని వివరాలూ ఇవ్వలేమని కేంద్రం తన వాదనను సమర్థించుకుంది. అయితే ఈ వాదనను కొట్టిపారేస్తూ, పెగాసస్లోని సాంకేతిక అంశాలపై 8వారాల్లో నివేదిక ఇవ్వాలని టెక్నికల్ కమిటీని సుప్రీం ఆదేశించింది. ఈనేపథ్యంలో బాధితులు ముందుకు వచ్చి తమకు వివరాలు ఇవ్వాల్సిందిగా కమిటీ ఈ ఏడాది జనవరిలో పబ్లిక్ నోటీస్ జారీచేసింది.