Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు నేతలను సత్కరించిన
- కిసాన్ విజయ్ ఉత్సవ్ సమితి
న్యూఢిల్లీ : దేశంలో సుదీర్ఘకాలం పాటు సాగిన చారిత్రాత్మక రైతు పోరాట సారధులకు ఘన సత్కారం లభించింది. మంగళవారం నాడిక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కిసాన్ రత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు పోరాటంలో పాల్గొన్న రైతు నేతలను కిసాన్ విజరు ఉత్సవ్ సమితి సత్కరించింది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కే ఎం) నేతలు హన్నన్ మొల్లా, అశోక్ ధావలే, రాకేశ్ తికాయత్,దర్శన్ పాల్ సింగ్, జగ్జీత్ సింగ్ దల్లేవాలా, యోగేంద్ర యాదవ్,గుర్నామ్ సింగ్ చౌదని, తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు తదితరులను సత్కరించారు.ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లాడుతూ చారిత్రక రైతు ఉద్యమం విజయం సాధించిందని అన్నారు.అలాగే నాటి ఉద్యమ విరమణ ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా చేసిన ఒప్పందంలోని అంశాలు పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు.మోడీ సర్కార్ రైతులను మోసం చేస్తుందనీ, దాన్ని రైతులు పసిగట్టారని తగినబుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.రైతులను వాహనాలతో తొక్కించిన వ్యక్తి బయట తిరుగుతున్నాడనీ,ఆయనకు బెయిల్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. పసుపు రైతు సంఘం నేత కోటపాటి నరసింహ నాయుడు మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. కానీ రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు.పసుపు బోర్డ్ కోసం అనేక సార్లు ఢిల్లీకి వచ్చి ధర్నా చేసినప్పుడు..ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అదే బీజేపీ నాయకులు నిజామాబాద్ కు వచ్చి పసుపు బోర్డ్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఒక ఎంపీ సీటు గెలుచుకున్నారని అన్నారు. ఇప్పుడు పసుపు బోర్డు ఇవ్వకుండా.. బోర్డ్ పనికిరాదని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతులను నిలువునా ద్రోహం చేయడమేనని విమర్శించారు. కేంద్రం పసుపు బోర్డు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.