Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత రెండు మాసాలుగా హర్యానా, ఢిల్లీల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆందోళనకు ఐద్వా మద్దతు తెలిపింది. వారి డిమాండ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆమోదించాలని కోరింది. గతేడాది డిసెంబరు 8 నుంచి హర్యానాలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె చేస్తున్నారు. వేలాదిమంది ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కర్నాల్‌లో అహర్నిశలు ధర్నా చేస్తున్నారు. ఢిల్లీలోనూ వేలాదిమంది సమ్మెలో ఉన్నారు. 2018 సెప్టెంబరులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విధంగా అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.1500, హెల్పర్లకు రూ.750 పెంచాలని వారు కోరుతున్నారు. మూడున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు వేతనాల పెంపు అమలు కాకపోవడంతో వారు సమ్మె బాట పట్టారు. రెండున్నర నెలలుగా సమ్మె కొనసా గుతున్నా తాను చేసిన ఒప్పందానికి కట్టుబడి వుండడానికి హర్యానా ప్రభుత్వం సుముఖంగా లేదు. పిల్లల్లో పోషకాహార సమస్యలను తగ్గించడానికి ఉద్దేశించిన పథకాల అమల్లో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కీలకం. కరోనా మహ మ్మారి సమయంలోనూ వీరు అవిశ్రాంతంగా సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల అంగన్వాడీ కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. దీని ప్రభావం మహిళలు, పిల్లల ఆరోగ్యంపై పడుతుందని ఐద్వా హెచ్చరించింది.