Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ : 2019 డిసెంబరులో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక పరిశీలించాకే తుది విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బుధవారం ఈ కేసు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. 2019 డిసెంబర్లో సిర్పూర్కర్ కమిషన్ను సీజేఐ బెంచ్ ఏర్పాటు చేసింది. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై ఆరోపణల వల్ల విచారణ కమిషన్ ఏర్పాటైంది. ఈ ఏడాది జనవరి 30న జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలోనే దిశ ఎన్కౌంటర్ కేసుపై విచారణను సీజేఐ ధర్మాసనం వాయిదా వేసింది. నివేదికను పరిశీలించాకే విచారణ జరపనున్నట్టు వెల్లడించింది. నివేదిక ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్, న్యాయవాది జిఎస్ మణిల విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించారు. విచారణలో ఇంప్లీడ్ అవుతామన్న పలువురు న్యాయవాదుల విజ్ఞప్తినీ సీజేఐ తిరస్కరించారు. సీల్డు కవరులోని ప్రతులు ధర్మాసనంలోని న్యాయమూర్తులకు అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. విచారణ వారం రోజులపాటు వాయిదా వేశారు.
కరోనా వల్ల కమిషన్ విచారణ నివేదిక ఆలస్యమైంది. 47 రోజుల పాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్.. జనవరి 28న సుప్రీంకు నివేదిక అందించింది. ఈ కేసుకు సంబంధించి కమిషన్.. అప్పటి సీపీ సజ్జనార్, సిట్ చైర్మెన్ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీతో పాటు పలువురు పోలీసులు అధికారులు, ఎన్కౌంటర్లో మృతిచెందిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను విచారించింది. దిశ హత్యాచార కేసులో నిందితులు విచారణ సమయంలో పోలీసులపై కాల్పులు జరపడం వల్ల ఎన్కౌంటర్ చేసినట్టు అప్పటి సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసుపై రాచకొండ సిపి ఛైర్మన్గా సిట్ ఏర్పాటైంది. అనంతరం 2019 డిసెంబర్ 12న సుప్రీం కోర్టు.. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ను నియమించింది.