Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : విద్యుత్ విభాగ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. విద్యుత్ సిబ్బంది చేపడుతున్న సమ్మెతో చండీగఢ్ అంధకారంలో మునిగిపోయింది. 36 గంటల నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచి వేలాది ఇండ్లలో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. కనీసం వీధి లైట్లు కూడా వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలను కూడా వాయిదా వేశారు. ఆన్లైన్ తరగతులు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వాస్పత్రులను జనరేటర్లతో నడిపిస్తున్నప్పటికీ.. కొన్ని శస్త్రచికిత్సలను వాయిదా వేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రయివేటీకరణ చేయాలన్న చండీగఢ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ సిబ్బంది మూడురోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అధికారులు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించకపోవడంతో సోమవారం సాయంత్రం నుంచి సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో అనేక గ్రామాల్లో వేలాది ఇండ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో చండీగఢ్ ప్రభుత్వం విద్యుత్ విభాగ సిబ్బందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేధం విధించింది. అయినప్పటికీ ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో బుధవారం ఉదయం నాటికి కరెంట్ కోత కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. కేంద్రపాలిత ప్రాంత చీఫ్ ఇంజనీర్‌కి బుధవారం సమన్లు జారీ చేసింది.