Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 రాష్ట్రాల్లో 100శాతానికిపైగా నిధులు ఖర్చు
- కేంద్రం ఇవ్వకపోయినా..అందుబాటులోని నిధులతో చెల్లింపులు
- అయినా వందరోజుల పని..కొంతమందికే
- నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉంది : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ సమయాన పేదల్ని, రైతు కూలీలను ఆదుకుంటున్న పథకం 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం' (నరేగా). ఉపాధి చూపాలని ప్రభుత్వాన్ని కోరతున్నవారి సంఖ్య నేడు భారీగా పెరిగింది. ఈ ఏడాది (2021-22) ఫిబ్రవరినాటికి 19 రాష్ట్రాలు ఉపాధి హామీ నిధుల్ని 100శాతానికిపైగా ఖర్చు చేశాయని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రూ.93,428కోట్లు మాత్రమే విడుదలకాగా, రాష్ట్రాలు రూ.95,664కోట్లు వ్యయం చేశాయని లెక్కతేలింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పథకం అమలుకు డిమాండ్ భారీగా నెలకొంది.
కేంద్రం నుంచి సమయానికి నిధులు విడుదల కాకున్నా, తమకు అందుబాటులో ఉన్న నిధుల్ని రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి. అలా 100శాతానికిపైగా 19రాష్ట్రాలు నిధులు ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఆర్థికమాంద్యం ఇంకా పోలేదని చెప్పడానికి ఉపాధి హామీ డిమాండ్ ప్రత్యక్ష ఉదాహరణ..అని నిపుణులు చెబుతున్నారు. గ్రామాల నుంచి వలస కార్మికులు తిరిగి నగరాలు, పట్టణాలకు వెళ్లినా..నరేగా పథకం అమలుకు డిమాండ్ తగ్గటం లేదు. క్షేత్రస్థాయిలో నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉండటమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
100రోజులపాటు పని తగ్గింది...
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జార్ఖాండ్-128శాతం, గుజరాత్- 110శాతం, ఉత్తరప్రదేశ్-100శాతం, పశ్చిమ బెంగాల్- 109శాతం.. నిధుల్ని ఖర్చు చేశాయి. ఆంధ్రప్రదేశ్-111శాతం, హర్యానా-105శాతం, మధ్యప్రదేశ్-104 శాతం, ఒడిషా- 100శాతం, ఉత్తరాఖండ్-107శాతం, కర్నాటక-100శాతం, కేరళ-111 శాతం..నిధుల్ని వ్యయం చేశాయి. అయినప్పటికీ 100రోజులపాటు ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 2021-22లో గణనీయంగా తగ్గింది.
కేవలం 37.3లక్షల కుటుంబాలకు 100రోజుల పని లభ్యమైంది. అంతక్రితం ఏడాది అయిన 2020-21లో 71.9లక్షల కుటుంబాలకు, 2019-20లో 41లక్షల కుటుంబాలకు, 2018-19లో 52.5లక్షల కుటుంబాలకు 100 రోజులపాటు పని దొరికింది.
కోలుకోని లేబర్ మార్కెట్
కోవిడ్ సంక్షోభం మొదలైన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగింది. కోవిడ్ నిబంధనలు, లాక్డౌన్లు ఎత్తేసినా..పట్టణాలు, నగరాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నా దేశంలో ఉపాధి సమస్య తీరటం లేదు. గ్రామాలకు తరలివెళ్లిన వలసకూలీలు, పట్టణాలు, నగరాలకు వచ్చినప్పటికీ..ఉపాధి పనుల కోసం డిమాండ్ తగ్గటం లేదు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లేబర్ మార్కెట్ పూర్తిగా కోలుకోలేదని ఆర్థిక నిపుణుడు కె.ఆర్.శ్యాం అభిప్రాయపడ్డారు.