Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను గెలుచుకున్న అభ్యర్థులు
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని తలసరి నగర్ పంచాయతీలో సీపీఐ(ఎం) ఘన విజయం సాధించింది. సీపీఐ(ఎం) యువ కార్యకర్తలు ఇద్దరు సురేశ్ భోయే, సుభాష్ డుమాడ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను గెలుచుకున్నారు. సీపీఐ(ఎం) ఆరు మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. 1962లో మహారాష్ట్రలో జరిగిన మొదటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి గత 60 సంవత్సరాలుగా విరామం లేకుండా సీపీఐ(ఎం) తలసరి నగర పంచాయతీ, తలసరి తహసీల్ పంచాయతీ సమితి రెండింటినీ వరుసగా గెలుస్తునే ఉంది. ఇది 1978 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నిరంతరంగా ఎమ్మెల్యే సీటును గెలుచుకుంటున్నది. అక్కడ ప్రస్తుతం సీపీఐ(ఎం) యువ నేత వినోద్ నికోల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తలసరిలోని పార్టీ కార్యాలయం నుంచి గోదావరి శ్యాంరావు పరులేకర్ భవన్ వరకు విజయోత్సవ యాత్రను గురువారం నిర్వహించారు. అక్కడ గెలుపొందిన అభ్యర్థులను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ ధావలే, మరియం ధావలే, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బార్క్యా మంగత్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే వినోద్ నికోల్ ఘనంగా సన్మానించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆదివాసీ మహిళలు తమ సాంప్రదాయ తార్ప నృత్యాన్ని ప్రదర్శించారు.