Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో పేద ప్రజల ఇక్కట్లు
- కరోనా విజృంభించి రెండేండ్లయినా మారని పరిస్థితులు : హంగర్ వాచ్ సర్వే
- సమస్యల పరిష్కారంలో మోడీ సర్కారు విఫలం
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి భారత్లో ప్రవేశించి దాదాపుగా రెండేండ్లు గడుస్తున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఫోర్బ్స్ ప్రకటించిన ధనవంతుల ఆస్థులు, ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగింది. ధనవంతుల సంఖ్య కూడా పెరిగింది. కానీ, దేశంలోని పేదల పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. పేదల ఆదాయాలు పడిపోయాయి. పేదల సంఖ్య పెరిగింది. ఇటు తినడానికి సరైన తిండి కూడా లభించడం లేదు. ఆహార భద్రత లేకపోవడంతో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పోషకాహార లోపంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హంగర్ వాచ్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీనిని రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ విడుదల చేసింది. దేశంలోని లాక్డౌన్ తర్వాత ఈ సర్వేను నిర్వహించారు. రెండో సర్వేను 14 రాష్ట్రాలలో డిసెంబర్ 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించారు. ఈ సర్వేలో 6,697 మంది పాల్గొన్నారు. వీరిలో 4,881 మంది గ్రామీణ ప్రాంతాల నుంచి 1816 మంది పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు. వీరిలో 31 శాతం మంది ఎస్టీలు, 25 శాతం మంది ఎస్సీలు, 19 శాతం మంది జనరల్ కేటగిరి నుంచి, 15 శాతం మంది ఓబీసీ, ఆరుశాతం మంది బలహీన గిరిజన తెగల నుంచి ఉన్నారు.
ఆదాయంపై ఎఫెక్ట్
ఈ సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది తమ నెలవారి కుటుంబ ఆదాయం రూ. 7వేల కంటే తక్కువగా ఉన్నదన్నారు. కరోనా మహమ్మారికి ముందు నుంచే అనేక తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్న ఈ కుటుంబాలు.. కరోనా, లాక్డౌన్ పరిస్థితులతో అవి మరింత ఎక్కువయ్యాయి. కరోనాకు ముందునాటి పరిస్థితులతో పోలిస్తే తమ ఆదాయాలు పడిపోయినట్టు 66 శాతం మంది తెలిపారు. కరోనాకు ముందు సంపాదించిన దానిలో సగానికి తమ ఆదాయం పడిపోయినట్టు 60 శాతం మంది చెప్పారు. 45 శాతం వరకు కుటుంబాలు తమకు అప్పు ఉన్నట్టు తెలిపాయి. రూ. 50 వేల కంటే ఎక్కువ అప్పు ఉన్నట్టు 21 శాతం మంది చెప్పారు. ఆహార భద్రత లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు ఆకలితో అలమటించాయి. 79 శాతం కుటుంబాలు ప్రభావితమయ్యాయి. 25 శాతం మంది తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్టు వివరించారు. మహమ్మారికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే పోషకాహార నాణ్యత కలిగిన ఆహారం తీసుకోవడం తగ్గిందని 41 శాతం మంది చెప్పారు. 84 శాతం కుటుంబాలు రేషన్ కార్డును కలిగి ఉన్నాయి. పేదల కోసం పథకాలను ప్రవేశపెడుతున్నామని చెప్తున్న మోడీ సర్కారు వారి సమస్యలను మాత్రం పరిష్కంరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.