Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం పట్ల సీపీఐ(ఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడం సరైన నిర్ణయం కాదని పేర్కొంది. తక్షణమే సైనిక పోరును నిలిపివేసి.. శాంతి స్థాపనకు కృషిచేయాలని సూచించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత.. రష్యాకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా అమెరికా నేతృత్వంలోని నాటో తూర్పు యూరప్‌లో విస్తరించుకుంటూ పోయిందని తెలిపింది. నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ప్రయత్నాలు రష్యా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందనీ, అంతేకాకుండా తూర్పు యూరప్‌లోని తన సరిహదుల్లో నాటో దళాలు, వాటి క్షిపణుల ఉనికి కారణంగా రష్యా.. తన భద్రత విషయంలో ఆందోళన చెందుతుందని పేర్కొంది. అందువల్ల నాటోలో ఉక్రెయిన్ చేరకుండా భద్రతా హామీనివ్వాలన్న రష్యా డిమాండ్ చట్టబద్ధమైనదని తెలిపింది. రష్యా భద్రతా అవసరాలను తీర్చేందుకు అమెరికా, నాటో తిరస్కరించడం.. ఈ ప్రాంతానికి సైన్యాన్ని పంపడంలో యూఎస్ చర్యల వల్ల అక్కడ ఉద్రిక్తతలు మరింత పెరిగాయని పేర్కొంది. శాంతి స్థాపన కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంతో సహా ప్రజలందరి నిజమైన ఆందోళనలను పరిష్కరించాలని సూచించింది. ఇరు దేశాలు చర్చలను పున్ణప్రారంభించాలని తెలిపింది. ఇరుపక్షాల మధ్య గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. అదేవిధంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది దేశ పౌరుల భద్రతకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరింది. భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.