Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఓలో విదేశీ పెట్టుబడులకు అవకాశం
- ఇష్యూలో 20 శాతం వాటాలు
- కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అనుకున్నట్లుగానే ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ భేటీలో ఇందుకు ఆమోదం తెలిపారని అధికార వర్గాల సమాచారం. ఎల్ఐసీ ఐపీఓలో 20 శాతం వాటాలను విదేశీ పెట్టుబడులకు కట్టబెట్టేలా తాజా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రయివేటు బీమా రంగంలో 74 శాతం నేరుగా విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. కానీ.. ఈ నిబంధన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కి వర్తించదు. ఎల్ఐసీ చట్టం 1956, ఇన్సూరెన్స్ యాక్ట్-1938 సహా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-1999 ప్రకారం ఎల్ఐసీలోకి నేరుగా విదేశీ పెట్టుబడులను అనుమతించరు. దీన్ని మార్చుతూ మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 20 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించారు. ఇదే తరహాలో ఎల్ఐసీలోకి 20 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించనున్నారు. ''ప్రస్తుతం అమలులో ఉన్న ఎఫ్‌డీఐ విధానానికి ప్రభుత్వం స్వల్ప సవరణలు తీసుకొచ్చింది. సరళంగా ఎఫ్‌డీఐ నిబంధనలను అర్థం చేసుకునేలా సవరించారు. సులభ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ఎఫ్‌డీఐ పాలసీలో సంస్కరణలు తోడ్పాటునిస్తాయి. తద్వారా భారీగా ఎఫ్‌డీఐ నిధుల రాకతో పెట్టుబడులు, ఆదాయం, ఉద్యోగాల్లో వృద్ధి నమోదవుతుంది'' అని ఓ అధికారి తెలిపారు. ఎఫ్‌డీఐ ఇష్యూ కోసం ఫిబ్రవరి 13న ఆ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఇందులో 5 శాతం వాటాలకు సమానమైన 61.6 కోట్ల షేర్లను విక్రయించనుంది. దీని ద్వారా కేంద్రం రూ.63వేల కోట్ల పైగా విలువ చేసే వాటాలను మార్కెట్ శక్తుల చేతుల్లో పెట్టనుంది. తాజా నిర్ణయంతో వచ్చే మాసంలో రానున్న ఐపీఓలో విదేశీ ఇన్వెస్టర్లకు ఎర్ర తివాచీ పర్చినట్లయ్యింది.