Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 11తో ముగిసిన పక్షంలో 7.89శాతం నమోదు
న్యూఢిల్లీ : ఆహారేతర రంగాల్లో రుణ వృద్ధి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 11నాటికి రుణ వృద్ధి 7.89శాతం నమోదైంది. దేశంలో ఆహారేతర రంగాల్లో మొత్తం రుణాలు రూ.115లక్షల కోట్ల నుంచి రూ.114.67లక్ష కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు డిపాజిట్లు మెరుగ్గా ఉన్నాయని, ఈ మొత్తం రూ.161.28లక్షల కోట్లకు చేరుకుందని ఆర్బీఐ పేర్కొన్నది. ఆహారేతర రంగంలో మొత్తం అప్పుల్లో అత్యధికవాటా రిటైల్ రుణాలదే. డిసెంబర్ 2021నాటికి వ్యక్తిగత రుణాల్లో 14.3శాతం వృద్ధి నమోదైంది. పారిశ్రామిక రుణాలు 0.4శాతం నుంచి 7.6శాతం పెరిగాయి. కార్పొరేట్ రుణాలు పెరిగే అవకాశముందని ఇంతకు ముందు అంచనావేయగా, ప్రస్తుతానికి రికవరీ పెద్దగా కనపడలేదు. డిసెంబర్ 2021నాటికి రుణాల్లో వృద్ధి 9.3శాతం ఉండగా, జనవరిలో 8శాతానికి పడిపోయింది. కార్పొరేట్ రుణాల చెల్లింపులు సరిగా లేకపోవటం వల్లే ఈ రంగంలో రుణాల వృద్ధి తగ్గడానికి దారితీసిందని తెలుస్తోంది. ఆర్బీఐ తాజా గణాంకాల నేపథ్యంలో 'ఎమ్కీ గ్లోబల్ ఫైనాన్స్' ఏమందంటే, ''ఈ ఏడాది జనవరి నాటికి దేశీయంగా రుణాల వృద్ధి ఫరవాలేదు. కోవిడ్ కేసుల ప్రభావం, స్వల్పకాలిక కార్పొరేట్ రుణాల చెల్లింపుల్లో సమస్యలను బ్యాంకులు ఎదుర్కొంటున్నాయి. వర్కింగ్ క్యాపిటల్‌తో కార్పొరేట్ రుణాల్లో తిరిగి డిమాండ్ నెలకొంటుందని బ్యాంకర్లు భావిస్తున్నారు'' అని ఒక ప్రకటనలో తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ ఖాటన్హార్ మాట్లాడుతూ..''మంచి రేటింగ్ ఉన్న కంపెనీలు సుదీర్ఘకాల అవసరాల కోసం రుణాలు కోరుతున్నాయి. అయితే వర్కింగ్ క్యాపిటెల్ కోసం కంపెనీలు బ్యాంకుల్ని ఆశ్రయిస్తున్నాయి. రిటైల్ రంగంలో రుణాల వృద్ధి బాగానే ఉంది. అన్ని రంగాల నుంచి రుణాల కోసం డిమాండ్ పెరుగుతోంది'' అని అన్నారు.