Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
- నిత్యావసర సరుకుల ధరలు పెరగటం ఖాయం!
- ఇప్పటికే రూ.160దాటిన లీటర్ వంటనూనె
- పరిశ్రమల ముడిపదార్థాల ధరలు పైపైకి..
- 2013-14లో 100డాలర్లు దాటిన ముడి చమురు
- వినియోగదారులపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడిన అప్పటి ప్రభుత్వం
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు (రూ.7507)దాటింది. ఈ పరిణామం ముఖ్యంగా భారత్‌ను తీవ్రంగా ప్రభావితం చేయనున్నది. 2013-14లో ముడి చమురు 100డాలర్లు దాటినా..దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు మోడీ సర్కార్ అలాంటి ప్రయత్నం చేస్తుందా? అంటే..చెప్పలేం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే మోడీ సర్కార్ ఇంధన ధరలు పెంచుడు ఖాయం. ఈనేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఆగమాగం అవుతుందనే ఆందోళన నెలకొంది.
న్యూఢిల్లీ : భారత్ ఇంధన అవసరాల్లో...85శాతం దిగుమతులతో ముడిపడి ఉంది. ఏడేండ్ల తర్వాత ముడి చమురు బ్యారెల్ 100 డాలర్లు దాటుతోంది. సహజవాయువు ధరలూ పెరుగుతున్నాయి. మనదేశం సహజవాయువు అవసరాల్లో 50శాతం దిగుమతులతో తీరుతున్నాయి. బొగ్గును దిగుమతి చేసుకున్నట్టు మూడో అతిపెద్ద దేశం భారత్. ఈనేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారత్ దిగుమతుల బిల్లును భారీగా పెంచుతుందని, తిరిగి వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటుందని వార్తలు వెలువడుతున్నాయి. అదే గనుక జరిగితే పేదలు, మధ్య తరగతి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2013-14లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటితే, ఆ భారాన్ని కేంద్రమే భరించి ప్రజలకు ఊరట కల్పించిందని, తద్వారా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డారని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
మోడీ సర్కార్ అలా చేస్తుందా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్లే మోడీ సర్కార్ ఇంధన ధరలు పెంచటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఓట్ల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిలిపివేయటం, ఆ తర్వాత భారీగా పెంచటం మోడీ సర్కార్ ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్..కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ధరల పెంపును ఆపేసింది. పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయని అధికార వర్గాలే చెబుతున్నాయి. దాంతో నిత్యావసర సరుకుల ధరలూ, సరుకు రవాణా ప్రభావితమవుతుందని, మార్చి మూడో వారం నాటికి దేశ ప్రజలకు మన పాలకులు షాక్ ఇవ్వటం ఖాయమని సమాచారం.
కోలుకోనంత దెబ్బ..
గతంతో పోల్చుకుంటే ముడి చమురు దిగుమతి బిల్లు పెరుగుతుంది. అయితే ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పుడు..ఆమేరకు వినియోగదారుడికి లబ్ది చేకూరలేదు. అంతర్జాతీయ ధరలను అనుసరిస్తే..ఇక్కడా ధరలు తగ్గాలి కదా! అలా జరగలేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగితే...ఒక్క గంట ఆలస్యం కాకుండా ధరల మార్పు అమలవుతోంది. దాదాపు అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు పేదలు, మధ్య తరగతి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఇంధన ధరలు మళ్లీ పెంచితే..దేశ ప్రజలపై కోలుకోనంత దెబ్బ పడుతుంది.
ముడి చమురు ధరల ప్రభావం మనదేశంపై ఊహించని స్థాయిలో ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. పరిశ్రమలు కొనుగోలు చేస్తున్న ముడి పదార్థాల ధరలు పెరగవచ్చు. ఉదాహరణకు సహజవాయువు, బొగ్గు ఆధారిత పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. గృహ విద్యుత్ ధరలు ఎంతోకొంత కచ్చితంగా పెరుగుతాయని తెలుస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3శాతం దాటుతుందని నిపుణులు చెబుతున్నారు. ధరల పోటు నుంచి వినియోగదారులు బయటపడటం అంత సులభం కాదు. ఈ పరిస్థితి చాలాకాలం కొనసాగవచ్చు.
ఆంక్షల ప్రభావం
ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేట్టు కనపడుతోంది. ఈ యుద్ధం..భారత్‌కే కాదు..ప్రపంచంలో ఏ దేశానికీ మంచిది కాదు. దీనివల్లే ముడి చమురు ధరలు రికార్డుస్థాయిలో వేగంగా పెరిగాయి. అమెరికా నేతృత్వంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది అంతర్జాతీయంగా ఇంధనరంగాన్ని ప్రభావితం చేస్తుంది. ఆంక్షల ప్రభావం కేవలం రష్యాపైన్నే ఉంటుందని అనుకోవటానికి లేదు. ముడి చమురు ధరలు పెరగటం ఒకరకంగా రష్యా చమురు ఆదాయాన్ని భారీగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ ముడి చమురు దిగుమతుల్లో 25శాతం, సహజవాయువు దిగుమతిలో మూడోవంతు రష్యా నుంచే జరుగుతోంది.