Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి 490 మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్, రొమానియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. బుకారెస్ట్ నుంచి బయలుదేరిన ఎఐ 1942 విమానంలో 250 మంది ఉన్నారు. ఈ విమానం ఆదివారం తెల్లవారుజామున 2:45 గంటలకు చేరుకుంది. బుడాపెస్ట్‌లో బయలుదేరిన ఎఐ 1940 విమానంలో 240 మంది ఉన్నారు. ఈ విమానం ఆదివారం ఉదయం 9.20 గంటలకు ఢిల్లీ చేరుకుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరుల కోసం శనివారం నుంచి కేంద్రం తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. అక్కడ చిక్కుకున్న పౌరులందర్నీ సాధ్యమైనంత త్వరగా తీసుకొస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం
ఉక్రెయిన్‌పై పరిస్థితిపై ప్రధాని మోడీ ఆదివారం రాత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి, అక్కడ చిక్కుకున్న పౌరుల్ని సురక్షితంగా తీసుకునిరావడంపై చర్చించారు. ఉక్రెయిన్‌లో సుమారు 16 వేల మంది భారతీయులు చిక్కుకుని ఉంటారని కేంద్రం అంచనా వేస్తోంది. వీరిలో అత్యధికులు విద్యార్థులే.