Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోరెత్తిన మిలాన్ విన్యాసాలు
విశాఖ : విశాఖ తీరం మిలాన్-2022 నౌకాదళ విన్యాసాలతో హోరెత్తింది. ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయం వేళలో ఆర్కె.బీచ్ జన సముద్రమైంది. లక్షల మంది వీక్షకుల ఆనందోత్సాహాలు, కేరింతల మధ్య సముద్ర జలాలపై నౌకలు, గగనతలంలో యుద్ధవిమానాలు, మెరైన్ కమాండోలు అబ్బురపరిచే విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్లో భాగంగా సముద్రం మధ్యలో యుద్ధనౌకల్లోని నావికులను సురక్షితంగా తీసుకెళ్లే సన్నివేశాలు ఆహ్లాదపరిచాయి. అతివేగంగా దూసుకొచ్చే యుద్ధవిమానాలు గగనతలాన్ని ముద్దాడి అంతర్థాన మయ్యే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్ఎస్ హరియంత్లోకి హెలికాప్టర్లలో మన దేశానికి చెందిన మెరైన్ కమాండోలు దిగుతూ అక్కడ శతృవులను మట్టుపెట్టి మరలా హెలికాప్టర్లలో వెనక్కి వెళ్లే సన్నివేశాలు వీక్షకులను గగుర్పాటుకు గురిచేశాయి. మిలాన్ ఆపరేషనల్ డెమాన్స్ట్రేషన్స్ విశాఖలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కాగా 7.30 గంటలకు ముగిశాయి.
షిప్‌యార్డు జాతి ఆస్తి : కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్
హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) జాతి ఆస్తి అని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజరు భట్ అన్నారు. షిప్‌యార్డులో ఆదివారం ఆయన పర్యటించి స్టీల్ షాప్స్, బిల్డింగ్ డాక్, రిపేర్ డాక్, అవుట్‌ఫిట్ జెట్టీలను పరిశీలించారు. నౌకానిర్మాణ కేంద్రంలో నిర్మితమవుతున్న 6 నౌకల పని ప్రగతిని ప్రశంసించారు. నౌకా నిర్మాణమైనా, షిప్ మరమ్మతు లైనా సకాలంలో కార్యకలాపాలు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.