Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్యతో బాదపడుతున్నవారి సంఖ్య మరింత పెరిగింది. కోవిడ్ మూడో వేవ్ తగ్గుముఖం పట్టినా..ఉపాధి కల్పన మెరుగుపడటం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తంగా దేశంలో నిరుద్యోగరేటు 8.1శాతం నమోదైందని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' (సీఎంఐఈ) తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగం (8.35శాతం) తిరిగి ఎనిమిది నెలల గరిష్టస్థాయికి చేరుకుందని నివేదిక పేర్కొన్నది. కోవిడ్ మొదటివేవ్ రాకముందు ఫిబ్రవరి, 2020లో దేశంలో నిరుద్యోగరేటు 7.76శాతం, అటు తర్వాత ఏడాది ఫిబ్రవరి 2021లో 6.89శాతం ఉండేదని సీఎంఐఈ తెలిపింది. గత రెండేండ్ల గణాంకాలను పరిశీలిస్తే నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉందని అర్థమవుతోంది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ భారత్లో ఉపాధి, కార్మికరంగ పరిస్థితులు, నిరుద్యోగంపై నిత్యం గణాంకాల్ని విడుదల చేస్తుంది.
తాజా నివేదిక ప్రకారం, గత ఆరు నెలలుగా దేశంలో నిరుద్యోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పట్టణ, గ్రామీణ నిరుద్యోగంలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ, నిరుద్యోగ సమస్య గరిష్ట స్థాయిలో కనపడుతోంది. దీనిపై కార్మిక, ఉపాధిరంగ నిపుణులు ఏమంటున్నారంటే, గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో పట్టణ నిరుద్యోగం పెద్ద ఎత్తున నమోదైంది. మూడో వేవ్, కరోనా ఆంక్షల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి కాస్త మెరుగుపడింది. అయితే మొత్తంగా చూస్తే గణాంకాల్లో పెద్దగా మార్పు రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరినాటికి పట్టణ నిరుద్యోగం 7.55శాతం వద్ద ఉంది. గ్రామీణ నిరుద్యోగం 8.35శాతం నమోదైంది.
'' కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పనులపై నిధుల కేటాయింపు తగ్గింది. ఇది గ్రామీణ ఉపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గ్రామీణ నిరుద్యోగం రికార్డ్ స్థాయిలో కనపడుతోంది. ఇక్కడ నిరుద్యోగ సమస్యను కనిష్టస్థాయికి తీసుకొస్తేగానీ కార్మికరంగం పరిస్థితులు మెరుగుపడవు. కేంద్రం స్వయంగా రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి'' అని ఆర్థిక నిపుణుడు కె.ఆర్.శ్యాం సుందర్ చెప్పారు.