Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గందరగోళంలో 23 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్
- పై తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థులు
- సబ్జెక్టులు అర్థంకాక అయోమయం
- రెండేండ్ల తర్వాత బడిలోకి అడుగు...
న్యూఢిల్లీ: పాఠశాల గదులకు దూరమై రెండేండ్లకు పైనే అయింది. కరోనా విజృంభించాక విద్యార్థులు ఆన్లైన్ చదువులకే పరిమితమయ్యారు. బడులు తెరిచాక..అక్కడి వాస్తవ పరిస్థితులు, ఇబ్బందులపై అనేక దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ) వైస్ ఛాన్సలర్ అనురాగ్ బెహర్ ఈ అంశాలపై 'ది వైర్' వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రస్తావించారు. భావితరంగా భావించే సుమారు 23 కోట్ల మందికి పైగా చిన్నారుల భవిష్యత్తు గందరగోళంలో పడినట్టు తమ పరిశీలనలో వెల్లడైందని ఆయన వివరాలు చెప్పుకొచ్చారు.
కరోనా దశలవారీగా వచ్చాక...ఇప్పడు ఒమిక్రాన్ నుంచి కోలుకున్నాక...బడులు తెరిచారు. దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల మంది విద్యార్థులు తలిదండ్రుల సపోర్ట్‌తో ఆన్లైన్ చదువులకు హాజరయ్యారు. వీరికి పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లల చదువులు అటకెక్కాయి. మొత్తం మీద 23 కోట్లమందికి పైగా విద్యార్థుల చదువులపై దుష్ప్రభావం పడినట్టు వెల్లడైంది.
బడులు తెరిచాక పరిస్థితేంటీ..?
రెండేండ్ల తర్వాత బడులు తెరిచారు. శానిటైజర్లు, మాస్కులతో పాఠశాల యాజమాన్యాలు అనుమతినిచ్చాయి. దీంతో పిల్లలు తరగతి గదుల్లోకి అడుగుపెడుతున్నారు. అయితే కరోనా మహమ్మారితో పాఠశాలలను మూసివేయడానికి ముందు వారికి బోధించిన పాఠ్యాంశాలను చాలా వరకు మర్చిపోయారు. దీనికి తోడు అదనంగా వారికి డబుల్ తరగతోన్నతి (ప్రమోట్)తో పాఠశాలల్లోకి తిరిగి అడుగుపెట్టారు. ఇది చదువులపై సమస్యను మరింత తీవ్రతరం చేసిందని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ అనురాగ్ బెహర్ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు రెండేండ్ల తర్వాత తరగతి గదులకు రావడం, టీచర్లు చెప్పే పాఠాలు అర్థం కాకపోవడంతో పాటు ఇప్పటికీ రోజు విడిచి రోజు విద్యార్థులను అనుమతించటంతో చదువు సవ్యంగా సాగట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులు విద్యార్థులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. ఉదాహరణకు, రెండేండ్ల కింద గ్రేడ్ 3లో ఉన్న విద్యార్థి కరోనా కాలానికి ముందు చెప్పిన పాఠాలన్నీ చాలా వరకు మర్చిపోయి ఉంటాడు. అలాంటి విద్యార్థి గ్రేడ్ 4కి వెళ్లకుండానే గ్రేడ్ 5 స్థాయిలో పాఠశాలకు తిరిగి వస్తున్నాడు. ఈ రకంగా చూస్తే...రెండేండ్ల పాఠశాల విద్యను పిల్లలు కోల్పోయారు. ప్రాధమిక విద్యను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉంది. ప్రణాళికాబద్ధంగా స్కూళ్లను ఎలా నడపాలి..విద్యాపరంగా ఇబ్బందుల్లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే. అయితే కొన్ని రాష్ట్రాలు చదువుపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు బేఖాతర్ చేస్తున్నాయి.
ఇవీ పరిష్కారాలు...
సిలబస్ పూర్తి చేశామని భావించకూడదు. ఎవరైతే చదువులో వెనకబడ్డారో..వారిని అప్‌గ్రేడ్ స్థాయికి చేరుకునేలా వెన్నుతట్టి ప్రొత్సహించాలి. దాన్ని రికవరి లాస్ లెర్నింగ్ అనవచ్చు. ఇక రెండోది విద్యార్థుల స్టాండర్ట్ ఎలా ఉన్నదో టీచర్ అంచనా వేయాలి. వారికి ఉన్న పరిణితి ప్రకారం గ్రూపులు చేసి, చదివించాలి. అయితే ఏ తరగతిలో అయితే వెనుకపడి ఉన్నాడని గుర్తించామో..ఆ క్లాస్ పుస్తకాలతో చదివిస్తే మంచిది. దీనివల్ల విద్యార్థులు రాణించటానికి వీలవుతుంది. కానీ ఆ విధంగా తరగతుల్లో అనుమతిస్తారా అనేదే ఇప్పుడు చర్చనీంశం. దేశవ్యాప్తంగా విద్యార్థుల గురించి కేవలం ఆరేడు రాష్ట్రాల్లో మాత్రమే ఆశించిన రీతిలో విద్య కొనసాగుతుంటే..12నుంచి 14 రాష్ట్రాల్లో చదువు సరిగా సాగటంలేదని అధ్యయనంలో తేలింది. ఇలాంటి చదువుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. ఇది ''బహుశా మన దేశం ఎదుర్కొంటున్న అత్యంత అత్యవసర సంక్షోభం'' అని బెహర్ తెలిపారు. ఈ విషయం తెలిసిన ప్రధాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా, మధ్యతరగతి స్థాయిలోనూ కీలకమైన ఈ సమస్య గురించి మాట్లాడటంలేదు..సరికదా ఎవరూ పట్టించుకోవటంలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.