Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లోనూ అనేకానేక కథనాలు వైరల్ అవుతున్నాయి. నకిలీ దృశ్యాలు, చిత్రాలతో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కుమ్మరిస్తున్నారు. వీటిలో అత్యధిక పాత వీడియోలే ఉండటం విశేషం. బిబిసి, ఎన్డిటివి, ఫ్యాక్ట్‌చెక్, ఆల్ట్‌న్యూస్ తదితర మీడియా సంస్థలు ఫ్యాక్ట్ఫైండింగ్ సాంకేతికతతో ఈ దృశ్యాలు, చిత్రాలు పాతవని తేల్చాయి. ఆ వివరాలు క్లుప్తంగా..
- రష్యా సైనికుడితో పోట్లాడిన బాలిక ఉక్రెయిన్ అమ్మాయి కాదు
రష్యా సైనికుడికి ఎదురుతిరిగి పోట్లాడుతున్న ఉక్రెయిన్ బాలిక అంటూ పోస్టు అయిన వీడియోను టిక్‌టాక్‌లో 1.5 కోట్ల సార్లు వీక్షించారు. ట్విట్టర్ 15 లక్షల సార్లు చూశారు. కానీ నిజానికి ఆ వీడియోలో ఉన్నది ఉక్రెయిన్ బాలిక కాదు. అది పాలస్తీనాలో ఇజ్రాయిల్ దాష్టీకానికి సంబంధించిన వీడియో. 2012లో అప్పుడు 11 ఏళ్ల వయసున్న పాలస్తీనా చిన్నారి అహద్ తమీమీ..తన సోదరుడిని అరెస్టు చేసిన అనంతరం ఒక ఇజ్రాయిలీ సైనికుడితో ఘర్షణ పడుతున్న దృశ్యమది. అయితే సదరు వీడియో 'అసందర్భమ'ని ట్విట్టర్లో లేలుబ్ వేశారు. కానీ ఫేస్బుక్, వాట్సాయాప్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ అది ఉక్రెయిన్ వీడియోగానే వైరల్ అవుతోంది.
- కీవ్‌లో పెట్రో బాంబుల పోరాటం
రష్యా సైనిక బలగాల కాన్వావ్ మీద ..కీవ్ ప్రజలు మొలొటోవ్ కాక్టెయిల్స్ (నాటు పెట్రోలు బాంబులు)తో పోరాడుతున్నారని పేర్కొంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఈ వీడియోలను పోస్టు చేయడంతో అవి ఉక్రెయిన్ పౌరులు-రష్యా బలగాల మధ్య జరిగిన ఘర్షణలుగానే చాలా మంది నమ్మారు. కానీ ఆ వీడియో పాతది. 2014లో అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను గద్దె దించడానికి కారణమైన యూరో మైదాన్ నిరసనల సందర్భంగా రికార్డు చేసిన వీడియో అది. ప్రస్తుత సైనిక ఆపరేషన్‌కు ఆ వీడియోకు సంబంధం లేదు.
- వీడియో గేమ్‌ను వాస్తవమైనదిగా వైరల్ చేశారు..!
ఒక రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ పైలట్ ఒకరు కాల్పులు జరిపి కూల్చివేస్తున్నట్లు కనిపించే నాటకీయమైన మరో వీడియో క్లిప్‌ను బెలారస్‌కు చెందిన నెక్ట్సా అనే టీవీ ఛానెల్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను కూడా వాస్తవమైనదిగా భావించి లక్షలాది మంది షేర్ చేశారు. వీడియోలో ఒక యుద్ధ విమానం మంటల్లో కాలిపోతూ పెద్ద శబ్దం చేస్తూ భారీ విస్పోటనంతో కూలిపోతుంది. దాదాపు పది లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. కానీ ఈ వీడియో కూడా నకిలీదే. ఆర్మా 3 అనే వీడియో గేమ్‌లోని ఒక క్లిప్ మాత్రమే. దీనికి ఉక్రెయిన్‌కు సంబంధమే లేదు.
- సైన్యానినికి చిన్నారుల భావోద్వేగ వీడ్కోలు !
ఇద్దరు చిన్నారులు..యుద్ధ రంగానికి వెళ్తున్న ఉక్రెయిన్ సాయుధ బలగాల కాన్వారుకి భావోద్వేగంగా వీడ్కోలు చెబుతున్నట్లు పోస్టు చేసిన ఒ ఫొటోకు లక్షల సంఖ్యలో లైక్‌లు, షేర్లు వచ్చాయి. వాస్తవానికి ఆ చిత్రానికి ప్రస్తుత పరిస్థితులకు సంబంధమేమీ లేదు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఆడం కన్జింగర్, స్వీడన్ మాజీ ప్రధానమంత్రి కార్ల్ బిల్ట్ తదితరులు సైతం ఈ ఫొటోను షేర్ చేశారు. వాస్తవానికి ఈ చిత్రం 2016లోనే ప్రచురితమైంది. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ కోసం ఒక వలంటీర్ ఫొటోగ్రాఫర్ ఈ ఫోటోను తీశారు. సైన్యానికి సంబంధించిన తన ఫొటోలను కొన్నింటిని కృత్రిమ సన్నివేశాలు సృష్టించి తీసినవనే ఆరోపణలు రావడంతో సదరు ఫొటోగ్రాఫర్‌ను విధుల నుంచి తొలగించారు కూడా.
- యుద్ధ రంగాన కీవ్ మేయర్
కీవ్ నగరం మేయర్ విటాలి క్లిట్సెకో యుద్ధ రంగాన ముందు వరుసలో దిగి ధీరోచితంగా నిలబడ్డారంటూ మరో ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయ్యింది. కానీ అది కూడా పాతదే. చెర్నిహియెవ్ ప్రాంతంలోని డెస్నా శిక్షణ కేంద్రం వద్ద తను ఉన్నప్పటి దృశ్యాన్ని చూపే ఈ ఫోటోని విటాలి 2021 మార్చిలో మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే ఇందులో ఒక వాస్తవం లేకపోలేదు. ఉక్రెయిన్ సైనికులతో కలిసి విటాలి పనిచేస్తున్నారనేది మాత్రం వాస్తవం. కాకపోతే ప్రచారంలో ఉన్న చిత్రం పాతది.