Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం : అంగన్వాడీ వర్కర్లపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్సు అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) నేతృత్వంలో సోమవారం జగదాంబలోని ఎన్పీఆర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా ర్యాలీగా వచ్చి తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. నగర పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి మహిళా పోలీసును రప్పించారు. కలెక్టరేట్‌కు వచ్చే నాలుగు కూడళ్లలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అడ్డంకులను అధిగ మించి కలెక్టరేట్‌కు చేరుకున్న అంగన్వాడీల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీ వస్తున్న రోడ్డులో కలెక్టరేట్ వద్ద బారికేడ్లు వేశారు. పోలీసులు, అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రోప్పట్టుకొని ముందుకు రాకుండా అడ్డుకోవడంతో అంగన్వాడీలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ తోపులాటలో మగ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మను పోలీసు అధికారి ఈశ్వరరావు 'ఏరు' అంటూ బెదించారు. సుబ్బరావమ్మ పొట్ట భాగంలో మహిళా పోలీసులు గోళ్లతో గిల్లారు. అసభ్యకరంగా మాట్లాడిన ఈశ్వరరావును సస్పెండ్ చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా అవమానకరంగా మాట్లాడారు. పోలీసులు ఎంత కవ్వింపు చర్యలకు దిగినా, అవమానపర్చినా, బెదిరింపులకు పాల్పడినా, కేసులు పెడతామని హెచ్చరించినా అంగన్వాడీలు తమ సహనం కోల్పోకుండా రెండు గంటలకుపైగా ఎండలోనే కలెక్టరేట్ రహదారిలో బైఠాయించారు. పోలీసుల తోపులాటలో అంగన్వాడీ కార్యకర్త ఒకరు సృహతప్పిపడిపోయారు.