Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగర్తలలో భారీ ర్యాలీ
- పాల్గొన్న వామపక్ష, కాంగ్రెస్ నాయకులు
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని త్రిపురలో లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి. శనివారం అగర్తలాలో చేపట్టిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకుల నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీలో పాల్గొన్న పౌరులు 'నా ఓటు, నా హక్కు' నినాదాలు చేశారు. త్వరలో జరగే ఎన్నికల్లో ఓటు హక్కును పరిరక్షించాలనీ, స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని వామపక్ష, కాంగ్రెస్ నాయకులు కోరారు. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, మాజీ సీఎం సమీర్ రంజన్ బర్మన్, కాంగ్రెస్ నాయకులు అజరు కుమార్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాణిక్ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ, ''ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలు, ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతోంది. వారి కార్యాలయాలను ధ్వంసం చేస్తోంది. 2018 తర్వాత ఇక్కడ జరిగిన ఏ ఎన్నికలూ స్వేచ్ఛగా నిర్వహించలేదు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. మా ఫిర్యాదులేవీ పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో 48 మంది జర్నలిస్టుల హత్యలు జరిగాయి. అత్యంత జనాదరణ పొందిన ఆరు న్యూస్ ఛానల్స్ మూతపడ్డాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పట్టపగలు ఐదు మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. ఐదేండ్లయినా దోషులపై చర్యలు లేవు. ప్రతిపక్షాలపై జరిగిన 2500కుపైగా దాడులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రతిపక్షాలకు చెందిన ఎంతోమంది అమాయక కార్యకర్తల్ని చంపేశారు. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. వీటినైనా స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా''మని చెప్పారు.