Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజ్రీవాల్, కవిత, ఎంపీ మాగుంట పేర్లు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ రెండో ఛార్జ్‌షీటును దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది. మొత్తం 428 పేజీల చార్జిషీట్లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది వివరించింది. ఇప్పటికే సమీర్ మహేంద్రు స్టేట్మెంట్లో కేజ్రీవాల్ పేరు వెల్లడైంది. కాగా ఈడీ చార్జిషీట్లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. ఇప్పటికే విచారించిన వారిలో, అలాగే ఆధారాలను ధ్వంసం చేసిన వారిలో కూడా కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ ఒబెరారు హోటల్లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఈడీ అధికారులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. 2022 నవంబర్ 12న అరుణ్‌పిళ్లైని విచారించినప్పుడు కవిత గురించి తెలిసిందని, ఢిల్లీ ఒబెరారు హోటల్లో కుట్రకు సంబంధించిన వ్యవహారమంతా జరిగిందని,ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి, ఢిల్లీలో మద్యం షాపులు.. ముఖ్యంగా ఎల్1 షాపులను దక్కించుకునేలా పావులు కదిపారని ఈడీ తెలిపింది. కవిత ప్రత్యేక విమానంలో పలుమార్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారని పేర్కొంది. లంచం ఇచ్చే వ్యవహారాన్ని కవిత పర్యవేక్షించి పని పూర్తయ్యేలా చేశారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీకి మద్యం టెండర్ల కోసం రూ.100 కోట్లు లంచంగా చెల్లించారనీ, ఇందుకు అరుణ్ పిళ్లై.. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఇండో స్పిరిట్స్‌లో పార్ట్నర్గా చేరారని తెలిపింది. ఈ సమయంలో కవిత ఉపయోగించిన రెండు ఫోన్ నెంబర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నెంబర్లను ఏ ఏ సమయంలో ఉపయోగిం చారో కూడా తేదీల వారీగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సమీర్ మహేంద్రు రూ.295.45 కోట్ల మేర నేరానికి పాల్పడ్డారనీ, ఈ మేరకు సాక్ష్యాధారాలు లభించాయని ఈడీ పేర్కొన్నట్టు కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇప్పటికే నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజరు నాయర్ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ కుంభకోణం కేసులో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్టు కూడా ఈడీ పునరుద్ఘాటించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు(ఏ1)గా సమీర్ మహేంద్రు ఉండగా.. మద్యం వ్యాపారి బినరు బాబు, అమిత్ అరోరా, దక్షిణాదికి చెందిన విజరు నాయర్, అభిషేక్ బోయినపల్లి, పి.శరత్ చంద్రారెడ్డిలను అరెస్టు చేసిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మనీశ్ సిసోడియాతో పాటు 14 మందిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు గుర్తు చేసింది.