Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలి : ప్రతిపక్షాలు డిమాండ్
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం విజరు చౌక్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి ప్రతిపక్ష నేతలు మీడియా సమావేశం నిర్వహించా రు. ''ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలి. లేదంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పర్యవేక్షణలో కమిటీతో దర్యాప్తు జరిపించాలి. ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కోట్లాది మంది ప్రజల పెట్టుబడులు న్నాయి. వారి సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడింది'' అని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ''మార్కెట్ విలువను కోల్పోతున్న కంపెనీలలో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడి సమస్యను చర్చించడానికి మేము రూల్ 267 ప్రకారం నోటీసు ఇచ్చాం. ముఖ్యమైన సమస్యలను లేవనెత్తినప్పుడు, వాటిపై చర్చకు సమయం ఇవ్వటం లేదు. ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల్లో పేదల సొమ్ము ఉంది. ఆ సొమ్మును ఎంపిక చేసిన కంపెనీలకు ఇస్తున్నారు'' అని విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో, ఎల్ఐసీలో దాచుకున్న కోట్లాదిమంది కష్టజీవుల సొ మ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
వ్యూహంపై అధికార, ప్రతిపక్షాలు భేటీలు
పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. పార్లమెంటులో వ్యవహరించాల్సిన వైఖరిపై చర్చించాయి. ఈ సమావేశంలో రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), కనిమొళి (డీఎంకే), ఎలమరం కరీం (సీపీఐ(ఎం)), సుదీప్ బందోపాధ్యాయ, డెరిక్ ఓబ్రెయిన్ (టీఎంసీ), వందన చౌహాన్ (ఎన్సీపీ), బినరు విశ్వం (సీపీఐ), సంజరు రౌత్ (శివసేన), కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పార్లమెంట్లో ప్రభుత్వం వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యూహంపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అనురాగ్ సింగ్, ఠాకూర్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.