Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఈసీ ఎన్నికలు నిర్వహించాలి
- సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్
- న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీపీఐ(ఎం) ఆందోళన
న్యూఢిల్లీ : త్రిపుర అసెంబ్లీ ఎన్నికలను విధ్వంసం చేయడానికి బీజేపీ డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శించారు. బీజేపీ అధికార దుర్వినియోగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆపాలని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడిక్కడ జంతర్ మంతర్ లో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలోనే ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. త్రిపురలో రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తాయా? అనేది ప్రధాన ప్రశ్నగా ఉందని అన్నారు. గత ఐదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలను బీజేపీ పూర్తిగా ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. వామపక్ష కార్యకర్తలపై హింసాత్మక దాడులు ఇంకా కొనసాగుతున్నాయనీ, ఇప్పటి వరకు 667 పార్టీ కార్యాలయాలు, 3,363 ఇండ్లు నేలమట్టం చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న వామపక్ష కార్యకర్తలపై కూడా బీజేపీ దాడులు చేస్తోందనీ, ఈ పరిస్థితిలో నిష్పక్షపాత ఎన్నికలు జరగవని అన్నారు. తమ అధికారాన్ని వినియోగించు కుని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహించాలనీ, ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులు కల్పించాలని కరత్ కోరారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు హన్నన్ మొల్లా, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, డీవైఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమగరాజ్ భట్టాచార్య తదితరులు మాట్లాడారు.