Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా సంస్థలకు బీజేపీ నేతల ఆదేశాలు
గౌతం అదానీ ఆర్థిక అక్రమాల్ని 'హిండెన్‌బర్గ్' బయటపెట్టాక, మీడియాలో పెద్ద ఎత్తున చర్చసాగింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు సంధించాయి. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాల గొంతును నొక్కేయటమేగాక, వారి ప్రశ్నలు అధికారిక రికార్డుల్లో నమోదుకాకుండా కేంద్రం తొలగించింది. అంతేగాక ఆ రోజు రాత్రి దేశంలోని మీడియా సంస్థల యాజమాన్యాలకు బీజేపీ పెద్దల నుండి ఫోన్‌కాల్స్ వెళ్లాయి. చర్చల సందర్భంగా 'ప్రధాని మోడీ పేరు వినిపించడానికి వీల్లేదు' అనే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధాని మోడీ పేరు వినిపించిందా? పర్యావసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది.. ఆ ఫోన్ కాల్స్ సందేశం.
- మోడీ పేరు చర్చకు తేవద్దంటూ బెదిరింపులు
- వేధింపులు, బెదిరింపులతో స్వతంత్ర మీడియాపై దాడులు
- సుప్రీంకోర్టును టార్గెట్ చేస్తూ..పాంచజన్యలో ఆర్ఎస్ఎస్ సంపాదకీయం
- భారత్‌లో మునుపెన్నడూ లేని పరిస్థితులు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చింది మొదలు, దేశంలో మీడియాకు సంకెళ్లు బిగుసుకున్నాయి. స్వతంత్రంగా వ్యవహరించే పాత్రికేయుల్ని, ఎడిటర్స్‌ను బెదిరించటం, జైళ్లకు పంపటం సర్వసాధారణమై పోయింది. 'బీబీసీపై ఐటీ దాడుల' వ్యవహారం బయటకు కనిపించేది మాత్రమే, కనిపించనవి ఎన్నో ఉన్నాయని, సామాన్యుడికి తెలియకుండా అనేకం జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టును అవమానించిన ఆర్ఎస్ఎస్
గుజరాత్లో 2002 మారణకాండపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ డాక్యుమెంటరీ ప్రసారాలను నిషేధించాలనే పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అధికార బీజేపీ నాయకులకు, ఆర్ఎస్ఎస్ వర్గాలకు సుప్రీంకోర్టు తీరు మింగుడుపడలేదు. దాంతో సుప్రీంకోర్టును అవమానపర్చే పన్నాగానికి తెరలేపారు. ఆర్ఎస్ఎస్ అధికారిక వార పత్రిక (పాంచజన్య)లో రాసిన 'సంపాదకీయం'లో సుప్రీంకోర్టుపై అనేక విమర్శలు ఎక్కుపెట్టింది. మరోవైపు బీబీసీపై ప్రతీకార దాడులు మొదలయ్యాయి. డాక్యుమెంటరీ విడుదలైన నెలరోజుల్లో ఐటీ దాడులు చోటుచేసుకున్నాయి. పన్ను ఎగవేతలు, ఆర్థిక అక్రమాలపై ఆధారాల్ని సేకరించాలని ఐటీ అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి కొనసాగుతోంది. దీనిని ఎలా డీల్ చేయాలో ఐటీ శాఖ ఉన్నతాధికారులకు అర్థం కావటం లేదు. ఇన్నేండ్లుగా బీబీసీపై రాని అనుమానం, లేని అక్రమాలు..ఇప్పుడు కొత్తగా గుర్తించడానికి ఐటీ శాఖ యంత్రాంగం రాత్రిపగలు అన్న తేడా లేకుండా పని చేయాల్సి వస్తోంది. ఏదో ఒక లోపాన్ని, అక్రమాన్ని గుర్తించాలని ఐటీ శాఖపై మోడీ సర్కార్ చేస్తున్న ఒత్తిడి మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల లోకం దీనిపై మాట్లాడుకుంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పాత్రికేయులు రాకుండా అడ్డంకులు
భారత్‌లో పనిచేస్తున్న విదేశీ మీడియా ప్రతినిధులపై గతకొన్నాండ్లుగా కేంద్రం పలు ఆంక్ష లు విధిస్తోంది. వారి వీసా పేపర్లకు ఆమోదం తెలప టం లేదు. భారత్‌లో పనిచేస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన మీడియా కరస్పాండెంట్స్ వీసా పేపర్లను కేంద్రం పక్కనపడేసింది. దాంతో వారు ఇక్కడ ఉండాలో, స్వదేశానికి వెళ్లిపోవాలో ? తెలియని సంకట స్థితిలో ఉండిపోయారు. ఇటీవల అమెరికాకు చెందిన ఒక పాత్రికేయుడు భారత్‌కు రాకుండా కేంద్రం నిరాకరిం చింది. బ్రిటన్ ప్రభుత్వ మీడియా అయిన 'బీబీసీ'పై ఏకంగా బెదిరింపులకు దిగింది. భారత్‌లో మీడియా స్వేచ్ఛపై ఇంత తీవ్రస్థాయిలో దాడులు జరుగుతు న్నా, పాశ్చాత్య మీడియా నోరు మెదపటం లేదు.
మీడియా స్వేచ్ఛపై కత్తి
ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, బెదిరింపులకు లోంగని వారిని కేంద్రం టార్గెట్ చేస్తోంది. అదానీ అక్రమాలు, బీబీసీ డాక్యుమెంటరీ బయటకు కనిపించే ఉదాహరణలు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదని స్వతంత్ర మీడియా పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్ మీడియా సంస్థల యాజమాన్యాలు, ఎడిటర్స్..మోడీ సర్కార్‌కు శత్రువులుగా కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పుకునే స్థితిలోకి బీబీసీని నెట్టడం మోడీ సర్కార్ వ్యూహం. తద్వారా దేశంలోని మిగతా మీడియాను కూడా ప్రభావితం చేయాలన్నది ఉద్దేశం. నిధులు అడ్డుకోవటం, పాత్రికేయుల్ని జైలు పాలు చేయటం పెద్ద విషయం కాదని బీజేపీ పెద్దలు బెదిరింపులకు దిగుతున్నారు.