Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీయూజే ఖండన
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో విధానసభ వద్ద సోమవారం జర్నలిస్టులు, కెమెరామెన్లపై దాడి జరిగింది. విధానసభకు చెందిన మార్షల్స్ సిబ్బంది ఈ దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం సమాజ్వాదీ పార్టీకి చెందిన శివపాల్ యాదవ్, తన పార్టీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న చౌదరీ చరణ్ సింగ్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ప్రాంతంలో సాథారణంగా ఇలాంటి ఆందోళనలు నిర్వహిస్తుంటారు. అలాగే ఈ ప్రాంతంలో జరిగే ఆందోళన లను మీడియా కూడా కవర్ చేస్తుంటుంది. అయితే సోమవారం మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. శివపాల్ యాదవ్ ఆందోళనను కవర్ చేయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. జర్నలిస్టులు, కెమెరామెన్లపై దాడికి దిగారు. మార్షల్స్ విధి నిర్వహణ కేవలం అసెంబ్లీలో మాత్రమే ఉంటుంది. వారు అసెంబ్లీలో మాత్రమే విధులు నిర్వహించాలి. ఇలాంటి ప్రాంతాలు పోలీసుల ఆధీనంలో ఉంటాయి. అయినా జర్నలిస్టులపై దాడి చేయడానికి మార్షల్స్ అసెంబ్లీ లోపల నుంచి వచ్చారు. విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లుపై మార్షల్స్ దాడిని ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ తీవ్రంగా ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే మార్షల్స్ ఈ దాడి చేశారని, అందుకు తగిన వీడియో ఆధారాలు ఉన్నాయని డీయూజే తెలిపింది. బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్లో మీడియాపై దాడులు పెరుగు తున్నాయని, దాడులు చాలా దారుణంగా ఉంటున్నాయని ఆరోపించింది.