Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జునైద్, నజీర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున సాయం
న్యూఢిల్లీ : గోరక్ష గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన జునైద్, నజీర్ కుటుంబ సభ్యులు, బంధువులను ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ, సీఐటీయూ నేతలు ఓదార్చారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ జిల్లాలోని ఘాట్మికా గ్రామాన్ని కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, కోశాధికారి పి కృష్ణప్రసాద్, ఉపాధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, రాజస్థాన్ కిసాన్ సభ సహాయ కార్యదర్శి సంజరు మాధవ్, సీఐటీయూ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు సత్బీర్ సింగ్ లతో కూడిన బృందం సందర్శించి.. జునైద్, నజీర్ కుటుంబ సభ్యులను పరామర్శించింది.
రెండు కుటుంబాలకు తాత్కాలిక సాయంగా ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున సాయం అందించారు. జునైద్ సోదరులు యూసుఫ్, జాఫర్ తమ బాధను కిసాన్ సభ నేతలతో పంచుకున్నారు. జునైద్ గ్రామంలో చిన్న దుకాణం నడుపుతున్నాడు. జాఫర్ కూతురు పెళ్లి ప్రపోజ్ చేసేందుకు జునైద్ తన స్నేహితుడు, డ్రైవర్ నజీర్‌తో కలిసి ఈ నెల 15న హర్యానా వెళ్లాడు. మరుసటి రోజు, హర్యానాలోని భివానీలోని లోహారులో ఇద్దరు మృతదేహాలు కాలిపోయి ఉన్నాయి. వారిని కిడ్నాప్ చేసి, 15 గంటల పాటు కొట్టి, ఆపై నిప్పంటించారు. కుటుంబానికి న్యాయం చేసేందుకు కిసాన్‌సభ అండగా ఉంటుందని నాయకులు హామీ ఇచ్చారు. ఇది మొదటి విడత సాయమని, రెండో విడత మళ్లీ అందిస్తామని అన్నారు. జునైద్ పిల్లలను కూడా నేతలు ఓదార్చారు. నజీర్ ఇంటికి చేరుకున్న నాయకులు అతని సోదరులు మహమూద్, హమీద్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముస్లింలు, దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు నిరసనగా గ్రామంలోని మసీదు దగ్గర నిర్వహించిన నిరసన ధర్నాలో నాయకులు పాల్గొన్నారు. కాగా, జంట హత్యల్లో ప్రధాన పాత్ర ఉన్నట్టు భావిస్తున్న భజరంగ్ దళ్ నేత సోనూ మణేశ్వర్ను కాపాడేందుకు ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల జాబితా నుంచి సోనూ పేరును రాజస్థాన్ పోలీసులు తొలగించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్లతో సోనూ ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.