Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
- నూతన విద్యా విధానం రద్దు చేయాలి
- విద్యా హక్కు చట్టాన్ని 12వ తరగతి వరకు పొడిగించాలి
- కాంట్రాక్టు టీచర్లు, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
- కదంతొక్కిన ఉపాధ్యాయులు
- ఎస్టీఎఫ్ఐ పార్లమెంట్ మార్చ్
న్యూఢిల్లీ : కొత్త పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం (ఒపిఎస్) పునరుద్ధరించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం జంతర్ మంతర్ లో ఈ ఐదు డిమాండ్ల సాధన కోసం స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు కదంతొక్కారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు డిమాండ్లతో కూడిన ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. మోడీ సర్కార్ విద్యా వ్యతిరేక విధానాలపై గర్జించారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు .కే.సీ హరికృష్ణ, సిఎన్ భారతి మాట్లాడుతూ మోడీ సర్కార్ విద్యా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. విద్యను కార్పొరేటీకరణ, కాషాయికరణ చేసేందుకు మోడీ సర్కార్ విధానాల రూపకల్పన చేసిందని ధ్వజమెత్తారు. నూతన పెన్షన్ విధానానికి భూమికగా ఉన్న పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని తక్షణ ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన పెన్షన్ లేని నూతన పెన్షన్ విధానం భవిష్యత్తులో ఉద్యోగులకి ఆర్థిక నష్టాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్ఎస్డీఎల్ లో మదుపు చేసిన సొమ్మును తిరిగి రాష్ట్రాలకు చెల్లించలేమని చెప్పటంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్‌లో సీపీఎస్ ను రద్దు చేయకుండా రాష్ట్రాలను నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగ విలువలను, జాతీయ సమైక్యత భావాలను నేర్పాల్సిన విద్యకు భిన్నంగా, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్య వ్యాపారం చేయటం తగదన్నారు. విద్యను ప్రోత్సహించకుండా.. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలనుకోవటం సరికాదనీ, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వ విధానాలను విమర్శించారు. వెంటనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్టీఎఫ్ఐ జాయింట్ జనరల్ సెక్రెటరీ సుకుమార్ పైన్, కోశాధికారి ప్రకాష్ చంద్ర మొహంతి మాట్లాడుతూ డిమాండ్లు నెరవేర్చకుంటే రాష్ట్రపతికి లక్షలాది మంది ఉపాధ్యాయుల సంతకాలతో కూడిన మెమోరాండం అందజేస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉపాధ్యాయుల దేశవ్యాప్త ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్.టి.శివరాజన్, మోహన్‌దాస్ పండిట్, ఎస్. మయిల్, మహావీర్ సిహాగ్, బినోద్ బిహారీ పాణిగ్రాహి, చారులత మహాపాత్ర , జాతీయ కార్యదర్శి బద్రున్నిసా, మహ్మద్ అల్లావుద్దీన్, కృష్ణ ప్రసన్న భట్టాచార్య, నాగేంద్ర సింగ్, సాయిబల్ రారు, ధర్మేంద్ర సింగ్ ఎ. శంకర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు యూసఫ్ తరిగామి, జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీఘోష్ సంఘీభావం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా హాజరు
ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు పార్లమెంట్ మార్చ్‌కు మద్దతు తెలుపుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది మంది ు ఉపాధ్యాయులు హాజరు అయ్యారు. తెలంగాణ నుంచి టి.యూటీఎఫ్ నేతలు బి.కోటేశ్వరరావు, బి.కళ్యాణి, ఎం. విజయలక్ష్మి, కె.రమేష్, వి.కొండలరావు, ఎ.చక్రవర్తి, బి.ప్రామాణిక్, బి.సైదులు, డి.భీమ్ శంకర్ , ఆంధ్రప్రదేశ్ నుంచి యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎస్ కుసుమకుమారి, రాష్ట్ర కోశాధికారి బి. గోపి మూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, డి అపర్ణ, ఎం శ్రీలక్ష్మి, సి హెచ్ పట్టాభి రామయ్య, కె. కమల కుమార్, ఎస్. రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లు ఇవే..
- నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)-2020ని రద్దు చేయాలి. అందరికీ ఉచిత, నిర్బంధ, నాణ్యమైన విద్యను అందించాలి.
- నూతన పెన్షన్ పథకం( ఎన్పీఎస్), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఎ) రద్దు, పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) అమలు చేయాలి.
- అన్ని తాత్కాలిక, అడ్హాక్, కాంట్రాక్ట్, టర్మ్ బేసిస్ టీచర్లు, ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలి.
- విద్యా హక్కు చట్టాన్ని 12వ తరగతి వరకు పొడిగించాలి. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి.
- రూ. 7.50 లక్షలు ఆదాయం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలి. రూ.2.5 లక్షలు వరకు స్టాండర్డ్ డిటెక్షన్ ఉండాలి. 80 సిసి మినహాయింపు రూ. 3 లక్షల వరకు ఉండాలి.