Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ రచించిన 'ఎగ్జామ్ వారియర్' పుస్తకాన్ని అన్ని పాఠశాలల లైబ్రరీలలో అందుబాటులో ఉండేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోరింది. ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన కొందరు అధికారులు వెల్లడించారు. '' 'సమగ్ర శిక్ష' కిందకు వచ్చే ప్రతి ఒక్క పాఠశాల లైబ్రరీలలో 'ఎగ్జామ్ వారియర్' పుస్తకం అందుబాటులో ఉండేలా చూడాలని, దీని ద్వారా గరిష్ట సంఖ్యలో విద్యార్థుల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రధాని విజ్ఞత, దార్శనికతతో కూడిన మాటల నుంచి ప్రయోజనం పొందుతారని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులను విద్యా మంత్రి కోరారు'' అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పుస్తకంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లు పరీక్షా ఒత్తిడిని అధిగమించే మార్గాలపై ప్రత్యేకమైన 'మంత్రాలను' పొందుపర్చారు. తెలుగుతో పాటు అసామియా, బంగ్లా, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠి, ఒడియా, పంజాబి, తమిళ్, ఉర్దూ.. ఇలా 11 భారతీయ భాషలలోకి 'ఎగ్జామ్ వారియర్' పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్టు అనువాదం చేసింది. బోర్డు పరీక్షలకు ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మోడీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహించే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలు, అనేక ఇతర సమస్యలు ఉన్నాయనీ.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వీటిపై కాకుండా 'ఎగ్జామ్ వారియర్' పుస్తకం విషయంలో మాత్రం అతి శ్రద్ధ వహిస్తున్నదని సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు అన్నారు.