Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2న ఓట్ల లెక్కింపు
కొహిమా, షిల్లాంగ్ : మేఘాలయ, నాగాలాండ్‌లలో సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతం నమోదైంది. మేఘలాయలో 77.5 శాతం, నాగాలాండ్‌లో 84 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. భారీ భద్రత నడుమ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటలకు వరకూ జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరొక 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 59 స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. మేఘాలయ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఫెడ్రిక్ రారు రాత్రి 7:30 గంటలకు మాట్లాడుతూ ప్రస్తుతానికి 77.55 శాతం పోలింగ్ నమోదయిం దని, తుది సమాచారం వచ్చిన తరువాత ఈ సంఖ్య 2018 ఎన్నికల పోలింగ్ శాతం (85.59 శాతం)ను సమీపిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. నాగాలాండ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వి.శకాంక్ శేఖర్ మాట్లాడుతూ 84.8 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. మేఘాలయలో మొత్తం 21.61 లక్షల ఓట్లు ఉండగా, నాగాలాండ్‌లో 13.17 లక్షల ఓట్లర్లు ఉన్నారు. నాగాలాండ్‌లో వోఖా జిల్లాలోని భండారి నియోజకవర్గంలోని అకుక్ గ్రామంలో జరిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. ఒక అభ్యర్థికి చెందిన మద్దతుదారులు మరొక అభ్యర్థికి చెందిన మద్దతుదారులపై దాడికి దిగడంతో ఈ ఘర్షణ జరిగింది. మేఘాలయలో బిజెపికి ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకోవడం, నాగాలాండ్‌లో ఒక అభ్యర్థి మరణించడంతోనూ రెండు రాష్ట్రాల్లోనూ 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. నాగాలాండ్‌లో 183 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, మేఘాలయలో 369 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలతోపాటు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మార్చి 2న ప్రకటించనున్నారు సోమవారం తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు), పశ్చిమబెంగాల్లోని సగర్దిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడం, జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడ్డంతో ఉప ఎన్నికలు జరిగాయి.