Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి : రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, ఎదురుదాడులు, ఆందోళనలతో అసోం ప్రభుత్వం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నది. మరొక ప్రశ్నపత్రం సైతం లీక్ కావడంతో ప్రభుత్వం పరీక్షల రీషెడ్యూల్‌కు నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లీషుతో పాటు ఆధునిక భారత భాషా సబ్జెక్టుల అన్ని పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. అస్సాం హై స్కూల్ పరీక్షలో పదో తరగతికి చెందిన అస్సామీస్ భాష ప్రశ్నపత్రం శనివారం జరగాల్సి ఉన్నది. అయితే, అది గురువారమే లీక్ అయింది. పదో తరగతి జనరల్ సైన్స్ ప్రశ్న పత్రం లీకైన మూడ్రోజులే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. జనరల్ సైన్స్ ప్రశ్న పత్రం లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నిరసనలకు దారి తీశాయి. రాష్ట్ర విద్యా మంత్రి రాజీనామాకు, కేసు దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు మంగళవారం నాడు ముగ్గురిని అరెస్టు చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుడు పరీక్ష కేంద్రం లుహిత్ ఖబాలు హెచ్‌ఎస్ స్కూల్ ఇంచార్జీ అని నా దృష్టికి వచ్చిందని అసోం సీఎం హిమంత విశ్వ శర్మ తెలిపారు. అస్సామీస్ పేపర్ లీకేజీని విచారణలో ఒప్పుకున్నారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అస్సామీస్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అస్సాం (సెబా)ను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఆధునిక భారతీయ భాషా సబ్జెక్టుల పరీక్షలు ఏప్రిల్ 1న రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో నిర్వహించబడతాయని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు తెలిపారు.