Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన 14 ప్రతిపక్షాలు
- ఏప్రిల్ 5న పిటిషన్ విచారణకు న్యాయస్థానం అంగీకారం
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్((సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాజకీయ దుర్వినియోగంపై ప్రతిపక్షాలు న్యాయపోరాటానికి సిద్ధమైయ్యాయి. రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు తాజాగా ఈ విషయంపై ఉమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల వివక్షపూరిత ప్రయోగానికి వ్యతిరేకంగా 14 రాజకీయ పార్టీలు శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అత్యవసర జాబితా కోసం ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం.. ఏప్రిల్ 5న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.ముందస్తు అరెస్టు మార్గదర్శకాలను అమలు చేయాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయనీ, నేడు సీబీఐ, ఈడీలు పూర్తిగా ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతున్నాయని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. సీబీఐ, ఈడీ ఏకపక్ష చర్యలకు వ్యతిరేకంగా మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు.
బీజేపీ ప్రత్యర్థులే లక్ష్యం
సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు కేవలం బీజేపీ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఈ పిటిషన్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. '' మొత్తం రాజకీయ ప్రతిపక్షాలను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకొని, వారి గొంతును అణచివేసి, ఎక్కువ కాలం జైలుకు పంపడానికి దర్యాప్తు ఏజెన్సీలు పని చేస్తున్నాయి. చాలా తక్కువ నేరారోపణలు ఉన్నప్పటికీ బెయిల్‌ను రాకుండా క్రూరమైన ప్రత్యేక చట్టాలను (మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002 వంటివి) తరచుగా ఉపయోగిస్తున్నాయి'' అని పిటిషన్లో పేర్కొన్నాయి. ''2014 నుంచి ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాయి. వీటిలో ఎక్కువ భాగం మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేస్తున్నది. అయినప్పటికీ, నేరారోపణ రేటు చాలా తక్కువగా ఉన్నది. పీఎంఎల్ఏ కింద కేవలం 23 నేరారోపణలు మాత్రమే నమోదయ్యాయి. చాలా కేసులు ప్రీ-ట్రయల్, ట్రయల్ దశలో పెండింగ్‌లో ఉన్నాయి'' అని పిటిషన్లో వివరించాయి. ''2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. వీరిలో 43 మంది ప్రతిపక్షాలకు చెందిన వారు ఉన్నారు. 2014 తర్వాత మొత్తం 124 మంది నేతల్లో 118 మంది ప్రతిపక్ష నేతలు ఉన్నారు. అంటే 95 శాతం కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి. 2014 తరువాత వేధింపుల సాధనంగా సీబీఐ, ఈడీ పనికిమాలిన దాడులను చేస్తున్నాయి'' అని పిటిషన్లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
బీజేపీలో చేరితే కేసుల విచారణ ఉండదు
ఒకవేళ సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరితే ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు ముగిసిపోతున్నాయని ప్రతిపక్షాలు తెలిపాయి. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఆప్ కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, అప్పటి శివసేన ముఖ్య నాయకులు సంజరు రౌత్ తదితర ప్రతిపక్ష నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయని పిటిషన్లో పేర్కొన్నాయి. కానీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి వంటి వారు బీజేపీలో చేరిన తర్వాత వారికి రహస్యంగా క్లీన్చిట్ ఇచ్చారనీ, వారిపై కేసుల విచారణ నత్త నడకగా సాగుతున్నదని వివరించాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఉన్న కేసుల విచారణ జరగటం లేదని పేర్కొన్నాయి. ''95 శాతం కేసులు ప్రతిపక్షాలపైనే. అరెస్టుకు ముందు, తర్వాత దర్యాప్తు సంస్థలు పాటిస్తున్న మార్గదర్శకాలు ఏమిటి?'' అని ప్రతిపక్ష పార్టీలు ఈ పిటిషన్లో కోరాయి. అరెస్టు, రిమాండ్, బెయిల్‌పై చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, కోర్టులకు మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్ఎస్, టీఎంసీ, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్ ఠాక్రే), జేఎంఎం, నేషనల్ కార్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్ దాఖలు చేశాయి.