Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతిపై చేయిచేసుకున్న బీజేపీ నేత
- ఎందుకు ప్రేమించావంటూ ధూషణలు
- సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్
లక్నో: మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే బీజేపీ నేతలు మహిళల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ మహిళా మోర్చా అలీగఢ్ నేత సంగీత వర్షిణి ఓ యువతిపై చేయిచేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 'ఓ ముస్లిం యువకుడితో ప్రేమాయణం నడిపేందుకు నీకు సిగ్గులేదా? హిందువులెవరో...ముస్లింలెవరో నీకు అర్ధం కావడం లేదా...' అంటూ పరుష పదజాలంతో దూషిస్తున్న వీడియో పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం... అలీగఢ్ ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువకుడు, యువతి నాలుగేండ్ల నుంచి ప్రేమించుకుం టున్నారు. నౌరగాబాద్ హిందూ వాహిని జనరల్ సెక్రటరీ దీపక్శర్మ పలుమార్లు వారిని వెంబడించాడు. రోడ్డుపై వెళ్తున్న వారిద్దరిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు. యువతి తల్లిదండ్రులకు, బీజేపీ నేతలకు, హిందూ వాహిని సభ్యులకు సమాచారం అందిం చాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న వర్షిణి...ఆ యువతి పట్ల దురుసుగా వ్యవహరించారు. 'మేమిద్దరం మేజర్లం.. ప్రేమించుకుంటే తప్పేముంది' అని యువతి అన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన వర్షిణి పై వ్యాఖ్యలు చేశారు. అలీగఢ్ సీనియర్ ఎస్పీ రాజేష్ పాండే ముస్లిం యువకుడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని వదిలిపెట్టమని యువతి తండ్రి కోరినా ఎస్పీ పట్టించుకోకుండా కేసు నమోదు చేయడం గమనార్హం.