Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐన్‌స్టీన్ చెప్పిన ఈ - ఎంసీ స్క్వేర్కన్నా..
- శక్తివంతమైన సూత్రీకరణ వేదాలలో ఉన్నదా..?
- ఆ విషయం స్టీఫెన్ హాకింగ్ చెప్పారంటూ..
- సైన్స్ కాంగ్రెస్‌లో కేంద్రమంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖమంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన ఈొ ఎంసీ స్క్వేర్ సూత్రీకరణ కన్నా శక్తివంతమైన సిద్ధాంతమే వేదాలలో ఉన్నదని ఇటీవల మరణించిన మరో ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అన్నారని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. హాకింగ్ పేరును తన వ్యాఖ్యల సమర్థనకు మంత్రి వాడుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అది ఆషామాషీ రాజకీయ సభ అయితే ఎవరూ అంతగా పట్టించుకునేవారు కాదు. దేశంలోని ఉద్దండ శాస్త్రవేత్తలు హాజరయ్యే సైన్స్్ కాంగ్రెస్‌లో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓవిధంగా ఈ వ్యాఖ్యలతో కేంద్రమంత్రి ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి. హాకింగ్ ఆ విధంగా చెప్పినట్టు ఆధారమేమిటని కేంద్రమంత్రిని విలేకరులు ప్రశ్నించారు. దాంతో, ఆధారం కోసం మీరు ప్రయత్నించండి, కనుగొనడంలో విఫలమైతే నా దగ్గరున్న సమాచారాన్ని మీకు ఇస్తానంటూ హర్షవర్ధన్ తప్పించుకున్నారు.
ఈ అంశంపై పలవురు శాస్త్రవేత్తలను జాతీయ మీడియా సంప్రదించగా హాకింగ్ అలా అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం గమనార్హం. దీనిపై బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సీనియర్ శాస్త్రవేత్త రోహిణీ గాడ్బోలే మాట్లాడుతూ 'నాకు అనుమానంగా ఉన్నది. హాకింగ్ నుంచి అటువంటి ప్రకటన వచ్చినట్టుగా నేను ఏనాడూ వినలేదు' అని అన్నారు.
ఈ-ఎంసీ స్క్వేర్ అంటే..?
ఐన్‌స్టీన్ చెప్పిన ఈ సూత్రీకరణ పదార్థ విజ్ఞానశాస్త్రంలో పలు అంశాలను అత్యంత సూక్ష్మంగా పరిశీలించేందుకు అవకాశం కల్పించింది. ఈ అంటే శక్తి, ఎం అంటే ద్రవ్యరాశి, సీ అంటే కాంతి వేగం, స్క్వేర్ అంటే రెండుసార్లు గుణించాలి. కాంతి వేగం సెకండ్‌కు 3 లక్షల కి.మీ... ఏదైనా పదార్థాన్ని పూర్తిగా మండించగలిగితే(శక్తిగా మారిస్తే) ఐన్‌స్టీన్ చెప్పిన లెక్క ప్రకారం అంత శక్తి విడుదలవుతుందని అర్థం. కాంతి వేగాన్ని రెండుసార్లు గుణించగా వచ్చిన ఫలితంతో ద్రవ్యరాశిని గుణిస్తే ఎంతకు సమానమో అంత శక్తి అన్నది ఆ సూత్రీకరణ సారాంశం. అయితే, ఏ కొద్ది పదార్థాన్ని కూడా పూర్తిస్థాయిలో మండించడం అంత తేలికైన విషయం కాదు. ఉదాహరణకు ఓ చిన్న కట్టెపుల్లను మండిస్తే అందులోంచి కొంత ఉష్ణం, కాంతి, పొగ వస్తుంది. అంతేకాదు..కొంత బూడిదగా మారుతుంది. అంటే..బూడిద కూడా కట్టెలోని పదార్థమేనన్నది గమనార్హం. కానీ, రేడియో ధార్మిక పదార్ధాలైన యురేనియం, థోరియంలాంటివాటిని పూర్తిస్థాయిలో మండించేందుకు అవకాశాలున్నాయి. దాని ఆధారంగానే అణుబాంబులు, హైడ్రోజన్ బాంబుల్ని రూపొందించారు. ఓవిధంగా ఐన్‌స్టీన్ సూత్రీకరణ అణుబాంబుల తయారీకి ఉపయోగపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడైన రూజ్వెల్ట్కు 1939, ఆగస్టు 2న ఐన్‌స్టీన్ ఓ లేఖ రాశారు. అణుబాంబుల తయారీకి ఉన్న అవకాశాల గురించి ఆ లేఖ ద్వారా అమెరికా శాస్త్రవేత్తలకు ఐన్‌స్టీన్ సూచించారు. ఆ లేఖ ప్రేరణతోనే మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్ ద్వారా మొదటి అణుబాంబును అమెరికా రూపొందించింది. అయితే, విధ్వంసం సృష్టించాలనేది ఐన్‌స్టీన్ ఆలోచన కాదు. జర్మనీ నియంతగా ఉన్న హిట్లర్ దగ్గర అటువంటి బాంబులు అప్పటికే ఉన్నాయని ఐన్‌స్టీన్ అనుమానించారు. హిట్లర్‌ను కట్టడి చేయడం కోసం కౌంటర్‌గా అమెరికా వద్ద కూడా అణుబాంబులు ఉంటే ఎవరూ ప్రయోగించకుండా రాజీపడే అవకాశముంటుందనేది ఐన్‌స్టీన్ ప్రణాళిక.
ఐన్‌స్టీన్ అదొక్కటే కాదు, మానవాళికి ఉపయోగపడే పలు సూత్రీకరణలు చేశారు. ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం, ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, గురుత్వాకర్షణ తరంగాలువంటివి అందులో కొన్ని..ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్‌కు ఐన్‌స్టీన్‌కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఐన్‌స్టీన్ సూత్రీకరణలు చాలావాటిని స్టీఫెన్హాకింగ్సహా ప్రముఖ శాస్త్రవేత్తలంతా అంగీకరించారు. ఇప్పటికే కొన్ని సూత్రీకరణలు ఆధారాలతోసహా రుజువయ్యాయి. గురుత్వాకర్షణ తరంగాల గురించి వందేండ్ల క్రితం చెప్పిన ఐన్‌స్టీన్ సూత్రీకరణకు ఇటీవలే శాస్త్రవేత్తలు రుజువులు సాధించారన్నది గమనార్హం.