Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితురాలి బహిష్కరణ
- రెండేండ్ల కూతురుతో మైనరు అవస్థలు
- రెండేండ్ల కూతురుతో మైనరు అవస్థలు
- అస్పృశ్యురాలిగా చూస్తున్న గ్రామస్థులు
రాంచీ : గాయంతో బాధపడుతున్న మైనరు బాధితురాలి పుండుపై కారం చల్లారు ఆ గ్రామస్థులు. 16 ఏండ్ల మైనరైన సామూహిక లైంగికదాడి బాధితురాలిని అస్పృశ్యురాలిగా చూస్తున్నారు. తనకు పుట్టిన పసికందుతో ఆమెను సామాజిక బహిష్కరణ చేశారు ఊరి జనం. రెండేండ్ల చిన్నారితో ఆ మైనరు బాధితురాలు పడుతున్న అవస్థలు అన్నీ.. ఇన్నీ.. కావు. జార్ఖండ్‌లోని చన్హో గ్రామంలో వెలుగుచూసిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. 13 ఏండ్లు మైనరుపై అంటే 2015లో అదే గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఎవరికైనా విషయం చెబితే చంపేస్తామని బెదిరించారు. భయపడిన ఆమె గమ్మునుండిపోయింది. ఆ తర్వాత.. కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళగా ఆరునెలల గర్భవతి అని తేలింది. అప్పటికే సమయం మించిపోయింది. 2016లో పాపకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు లేని ఆమె సోదరితో కలిసి నివాసముండేది. గర్భిణి అని తెలిశాక... బలవంతంగా మధ్యలో స్కూలు మానేయాల్సి వచ్చింది. ఇతర పిల్లల తల్లిదండ్రులెవరూ ఆమెతో కలవనిచ్చేవారు కాదు. చుట్టుపక్కలవారి సూచిపోటి మాటలు.. ఎదురుపడితే చంపేస్తామని బెదిరింపులతో ఎప్పుడూ నాలుగుగోడల మధ్యనే గడుపుతున్నది. చివరకు ఆ కుటుంబం నడుపుతున్న చిన్న దుకాణం నుంచి నిత్యావసరాలు కొనడం కూడా మానేశారు గ్రామస్తులు. తన కోసం, తన పాప కోసం ఏమైనా కొందామని బయటకువస్తే అసహ్యించుకుంటున్నారు. అంతేకాదు లైంగికదాడి ఘటన నేపథ్యంలో బాధితురాలికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఘటన జరిగి మూడేండ్లయినా ఇంతవరకూ ఎలాంటి సహాయం అందలేదు. మరో విచిత్రమేమంటే.. తండ్రిపేరు లేదన్న సాకుతో ఆమెకు పుట్టిన పాపకు వ్యాక్సిన్ వేసేందుకు కూడా నిరాకరిస్తున్నారు. బాధితురాలిపై చూపుతున్న వివక్షపై మీడియాలో వార్తా కథనాలు రావడంతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆమెను వేధింపులకు గురిచేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామనీ, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ ఆర్కె సింగ్ చెప్పారు.