Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా వ్యాఖ్యలకు కట్టుబడివున్నా
- హిందూ తొలి తీవ్రవాది వ్యాఖ్యలపై కమల్‌హాసన్
చెన్నై : స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందువైన గాడ్సేనంటూ వ్యాఖ్యానించిన విలక్షణ నటుడు, మక్కల్ నీది మయిమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సేపై తాను కేవలం చారిత్రక వాస్తవాన్ని మాత్రమే చెప్పానన్నారు. 'అరవకురిచ్చిలో నేను చేసిన వ్యాఖ్యలు వారికి ఆగ్రహం కలిగించవచ్చు. కానీ, ఎవరినో వివాదంలోకి దించేందుకు, కొందరిని మభ్యపెట్టేందుకు నేను ఈ వ్యాఖ్యలుచేయలేదు. చారిత్రక వాస్తవాన్ని మాత్రమే చెప్పాను' అని కమల్ హాసన్ అన్నారు. తమిళనాడు తిరుపురన్కుండ్రమ్లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఎక్స్ట్రీమిస్ట్ అన్న పదాన్ని అర్థంచేసుకోండి. గాడ్సేకు వ్యతిరేకంగా తాను టెర్రరిస్టు, హంతకుడు అన్నపదాలను వాడలేదు. సాధారణంగా రాజకీయాల్లో వాడుకలో వున్న 'ఎక్స్ట్రీమిస్ట్' అన్నపదాన్ని వాడాను. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించానని వార చెబుతున్నారు. నా కుటుంబంలో కూడా అనేక మంది హిందువులున్నారు. నా కుమార్తె కూడా హిందువే' అని కమల్ చెప్పారు.
చెప్పు దాడి..
కమల్‌హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే వాహనంపై నుంచి కమల్ హాసన్ మాట్లాడుతుండడగా ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసరటంతో గందరగోళం నెలకొన్నది. ఈ ఘటన తిరుప్పరన్‌కుంద్రమ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బుధవారం చోటుచేసుకొన్నది. ఈ దాడి నుంచి కమల్ తృటిలో తప్పించుకొన్నారు. దాంతో చెప్పు వెళ్లి సభకు హాజరైన ప్రజలపై పడింది. కమల్ వాహనంపైకి చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తి దాడి వెనుక కారణమేమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి ఘటనను పలు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఖండించారు. ఇటీవల కమల్ హాసన్ హిందూ టెర్రరిస్టు అనే వ్యాఖ్యల నేపథ్యంలోనే దాడి జరిగిందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
'గాడ్సే' దేశభక్తుడు : ప్రగ్యా ఠాగూర్
న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'మహాత్మగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడు. అతన్ని తీవ్రవాది అంటున్న నాయకులకు ప్రజలు ఓట్ల రూపంలో సమాధానం చెప్తారు' అని వ్యాఖ్యానించారు. గాడ్సేపై కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రగ్యాసింగ్ పై విధంగా స్పందించారు.