Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా దగ్గర మిస్ కాలేదు : ఈసీఐ
- ఫ్రంట్‌లైన్ కథనంతో కీలక మలుపులు
న్యూఢిల్లీ : ఈవీఎం ట్యాంపరింగ్, స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంల తారుమారుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాల వాదనలకు 19లక్షల ఈవీఎంలు అదృశ్యమయ్యాయని వచ్చిన ఓ రిపోర్టు మరింత బలాన్నిస్తున్నది. 19లక్షల ఈవీఎంలను తయారీ దారులు ఈసీఐఎల్, బీఈఎల్‌లు పంపిణీ అయినట్టు ఓ ఆర్టీఐ కార్యకర్త వివరించారు. కానీ, అవి తాము స్వీకరించలేదని ఎన్నికల కమిషన్ వెల్లడించడం దుమారం రేపుతున్నది. దీంతో 19 లక్షల ఈవీఎంలు ఎక్కడికెళ్లాయన్న విషయం చర్చనీయాంశమైంది. మనోరంజన్ రారు అనే ఆర్టీఐ కార్యకర్త పలు ఆర్టీఐ దరఖాస్తుల ఆధారంగా సేకరించిన సమాచారంతో బాంబే హైకోర్టులో 2018 మార్చిలో ఓ ప్రజా ప్రయో జన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈవీఎం కొనుగోలు, సరఫరా, భద్రతలపై పూర్తి సమాచారమివ్వాలని ఆయా శాఖలు, సంస్థలకు ఆదేశాలివ్వాలని కోర్టును ఆ పిల్ కోరింది.
మా దగ్గర నుంచి తప్పిపోలేవు : ఈసీ
కాగా, ఈ పిల్ ఆధారంగా ఫ్రంట్‌లైన్ మే 9న వెలువరించిన కథనంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. 15 ఏండ్లలో ఈవీఎం తయారీ సంస్థ ఈసీఐఎల్ డెలివరీ చేసినట్టు చెబుతున్న 9,29,949 ఈవీఎం మెషిన్లు, బీఈఎల్ సంస్థ పంపించినట్టు పేర్కొన్న 9,64,270 ఈవీఎంలు ఎన్నికల కమిషన్ అందుకోలేదని ఈ స్పందనతో స్పష్టమైంది. ఆ కథనం ఊహాత్మకంగా ఉందని ఈసీ విమర్శించింది. ఫ్రంట్ లైన్ కథనాన్ని ఖండిస్తూ.. ఆ ఈవీఎంలు తమ దగ్గర నుంచి తప్పిపోలేవని ఆ పత్రికకు సమాధానమిచ్చింది. అంతేకాదు, ఈవీఎంలు ఎక్కడ ఉన్నాయో పసిగట్టే పటిష్టమైన ఈవీఎం మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్(ఈఎంఎస్) కలిగి ఉన్నట్టు తెలిపింది. అలాగే స్థానిక ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)లు స్వతంత్ర వ్యవస్థలని, ఈసీఐకి ఎస్ఈసీలపై అధికారాల్లేవని వివరించింది. ఎస్ఈసీలు చేసే ఈవీఎంల కొనుగోలుతో సంబంధంలేదని తెలిపింది.
అది సరైన సమాధానం కాదు : ఫ్రంట్‌లైన్
ఈవీఎంల ఆర్డర్, సరఫరాలోని వ్యత్యాసాన్ని పిల్ ఆధారంగా ఫ్రంట్‌లైన్ హైలైట్ చేసింది. కానీ, ఈసీఐ దానికి సమాధానం చెప్పలేదని ఫ్రంట్‌లైన్ పత్రికా ప్రతినిధి పేర్కొన్నారు. అవి ఊహాత్మక సంఖ్యలు కాదు.. ఆర్టీఐ ద్వారా పలు సంస్థల నుంచి సేకరించినవని వివరించారు. ఈసీఐ చెబుతున్నట్టు ఈఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటే.. ఏ హౌటల్ రూముల్లోనో, సంబంధమేలేని ఇతర ప్రదేశాల్లో ఈవీఎంలు కనిపించినప్పుడు ముందుగా ఈసీఐకే ఈ విషయం తెలియాలి గానీ, దాదాపుగా ప్రతిసారీ మీడియానే బహిర్గతం చేస్తున్నదని గుర్తుచేశారు.