Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ సాంస్కృతిక కార్యక్రమంలో నిర్వాహకుల జులుం
గువహతి : ఓ సాంస్కృతిక కార్యక్రమం కోసం నాట్యం చేయడానికి వచ్చిన మహిళా కళాకారులను దుస్తులు విప్పి నృత్యం చేయాలని నిర్వాహకులు బలవంతం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రెండ్రోజుల క్రితం అసోంలో చారుగావ్ గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి బెంగాల్ నుంచి నృత్యకారిణులను తీసుకొచ్చారు. మహిళా కళాకారులంతా దుస్తులు లేకుండా నాట్యం చేస్తారని చెప్పి నిర్వాహకులు అధిక ధరకు టికెట్లు అమ్ముకున్నారు. నృత్యం చేసే మహిళలు వేదిక వద్దకు చేరుకోగానే నిర్వాహకులతో పాటు కార్యక్రమం చూడటానికి వచ్చిన వారంతా నృత్యకారిణుల వస్త్రాలు విప్పాలని బలవంతం చేశారు. ఇది ఊహించని కళాకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పలువురు దుండగులు వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. మీడియాలో వచ్చిన వీడియోలను సుమోటాగా స్వీకరించి నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనతో సంబంధం ఉన్న షారూఖ్ ఖాన్, సుభానా ఖాన్ అనే ఇద్దరినీ అసోం పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ స్పందిస్తూ.. ఈ ఘటనతో సంబంధమున్న ప్రతీ ఒక్కరినీ అరెస్టు చేస్తామని తెలిపారు.