Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు అందని ఉపాధి, ఉద్యోగం
- ఆల్‌టైం హైకి చేరిన మహిళా నిరుద్యోగిత
- కార్మికశక్తిలో పడిపోయిన మహిళల భాగస్వామ్యం
- ఒకప్పుడు 42శాతం ఇప్పుడు 22శాతం..
కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలుంటే, వారి పిల్లలకు మంచి విద్య అందుతుంది. ఆ ఇంట్లో వృద్ధులకు ఏదైనా ఆరోగ్య సమస్యవస్తే 'ఆర్థికంగా' భయపడే పరిస్థితి ఉండదు. ఒకవేళ మహిళ ఉద్యోగాన్ని కోల్పోతే...పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అవుతుంది. ఇప్పుడు మనదేశంలో అనేక కుటుంబాలకు ఈ ప్రమాదం పొంచివుంది. కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం 42 నుంచి 22శాతానికి పడిపోయింది. మొత్తంగా మహిళల్లో నిరుద్యోగ సమస్య ఆందోళనకరస్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన నివేదికలోనే ఈ విషయాలు ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ : మనదేశంలో మహిళల్ని నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గత ఏడేండ్లలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దారుణంగా దెబ్బతినటంతో, కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం 22శాతానికి (2017-18) పడిపోయింది. 2004-05లో దేశవ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం 42శాతంగా నమోదైంది. క్రమంగా తగ్గుతూ 2017-18నాటికి సగానికి పడిపోయి...22శాతం ఉందని లెక్కతేలింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన 'పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే'లో పేర్కొన్నారు.
గత 10-15 ఏండ్లుగా మనదేశంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయిగానీ, ఆ బలం మహిళలకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించలేకపోయింది. కనీసం ఈ సమస్యను పరిశీలించే ప్రయత్నం కూడా జరగలేదని తాజా గణాంకాలు చూస్తే అర్ధమవుతోంది. మహిళల్లో నిరుద్యోగత ఆందోళనకర స్థాయికి చేరుకున్నా, పాలకుల్లో మాత్రం కదలిక రావటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం 22శాతానికి పడిపోయిందన్న విషయం స్వయంగా కేంద్రం విడుదల సమాచారంలో ఉందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
మిగతావారి పరిస్థితేంటి?
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (కేంద్ర గణాంక సంస్థ
నిర్వహించింది) ప్రకారం, కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం క్రమంగా తగ్గుతోంది. కార్మికశక్తిలో పాలుపంచుకోని మిగతా 78శాతం మహిళలు ఏం చేస్తున్నారు? అని పరిశీలించగా, కట్టెలు కొట్టే పని, ఇంటిపని, చిన్న చిన్న వ్యవసాయ పనులు, కోళ్లు, పశువులకు మేత వేయటం, పట్టణాల్లో చిన్న చిన్న పనులతో తృప్తి పడాల్సి వస్తోంది. 78శాతం మహిళలు స్థిరమైన ఉపాధి, ఆదాయానికి దూరమయ్యారు. భారతీయ సమాజంలో మహిళలపై కొనసాగుతున్న వివక్ష వారి నిరుద్యోగ సమస్యను మరింత పెంచిందని చెప్పక తప్పదు.
వేతనంలో వ్యత్యాసం..
ఒకేస్థాయి పనిలో ఉన్న పురుషులకు, మహిళలకు అందుతున్న వేతనాల్లో భారీ తేడా ఉందని 'పిరియాడిక్ లేబర్ ఫోర్స్' స్పష్టం చేసింది. గ్రామాల్లో పురుషులకన్నా మహిళలకు 34శాతం తక్కువ వేతనాన్ని ఇస్తున్నారు. పట్టణాల్లో ఈ తేడా 20శాతంగా నమోదైంది. ముఖ్యంగా సేవారంగంలో, స్వయం ఉపాధిరంగంలో పనిచేస్తున్న మహిళలు పెద్ద ఎత్తున వివక్షను ఎదుర్కొంటున్నారు. పురుషులకు ఇస్తున్న వేతనంలో సగం కూడా ఇవ్వటం లేదని తేలింది. వంటమనిషి, ఆయాలు, ఇంటిపనిమనిషి, బట్టలషాపుల్లో, నిర్మాణరంగంలో, ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో పనిచేస్తున్న మహిళలకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అంతేగాక వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత(పీఎఫ్, ఆరోగ్యబీమా...మొదలైనవి) ఉండటం లేదు.