Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సిస్కో ఉద్యోగిపై వేధింపులు
-ఉద్యోగికి అంబేద్కర్ గ్రూపుల మద్దతు
న్యూఢిల్లీ : ఉత్తర అమెరికాలో భారత సంతతికి చెందిన సిస్కో ఉద్యోగి కుల వివక్షను ఎదుర్కొంటున్నారు. సంస్థలోని ఇద్దరు మేనేజర్ల గత కొంతకాలంగా దళిత ఉద్యోగిపై కులం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలొచ్చాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి.. ఆయనకు న్యాయం అందించాల్సిన సిస్కో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నదంటూ వార్తలొచ్చాయి. కాగా, ఉద్యోగిపై కుల వివక్షను అంబేద్కర్ గ్రూపులు తీవ్రంగా ఖండించాయి. ఆ ఉద్యోగికి బాసటగా నిలిచాయి. 'ఇది ఆందోళనకరమైన అంశం' అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్, అంబేద్కరైట్స్ ఇంటర్నేషనల్ మిషన్ సొసైటీ ఆఫ్ కెనడా, అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, అంబేద్కర్ బౌద్ధ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్, బోస్టన్ స్టడీ గ్రూప్, చెట్నా అసోసియేషన్ కెనడా తదితర సంఘాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.
అమెరికన్ కార్పొరేట్లు వ్యూహాత్మక స్థానాలను ఆక్రమించడంతో, అన్ని రంగాలలో కులం తన పాత్ర పోషిస్తుందనే భయాలు నిజమవుతున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. 'హిందువులు ఇతర ప్రాంతాలకు వలస వెళితే.. భారతీయ కుల వ్యవస్థ ప్రపంచ సమస్యగా మారుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుగానే ఊహించారు. అనేక ఏండ్ల తర్వాత కూడా మనం తీవ్ర వివక్షను చవిచూస్తున్నాం. దీనిని రూపుమాపేందుకు అన్ని సంఘాలు కలిసికట్టుగా ముందుకు సాగాలి' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కుల ఆధారిత వివక్షకు పాల్పడినవారిపై భారీ జరిమానా విధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.