Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉపేంద్ర కథానాయకుడిగా శ్రీ సిద్దేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'కబ్జ'. లాంకో శ్రీధర్ సమర్పణలో ఆర్.చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం థీమ్ పోస్టర్‌ను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు.
'కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సరికొత్త కథ, కథనాలతో నటిస్తున్న చిత్రమిది. ఉపేంద్ర ఎంచుకునే పాత్రలు, నటించే చిత్రాలు వేటికవే వైవిధ్యంగా ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. ఆ వైవిధ్యమే తెలుగు ప్రేక్షకులకు ఆయన్ని మరింత దగ్గర చేసింది. హీరోగా, దర్శకుడిగా ఆయన సినిమాలు తెలుగునాట సంచలన విజయాలు సాధించాయని చెప్పడానికి 'ఏ', 'ఉపేంద్ర', 'రక్తకన్నీరు', 'బుద్ధిమంతుడు', 'సూపర్' వంటి భిన్న చిత్రాలే ప్రత్యక్ష ఉదాహరణ. 2015లో విడుదలైన 'సన్ ఆఫ్ సత్యమూర్తి'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఉపేంద్ర తాజాగా పాన్ ఇండియన్ సినిమా 'కబ్జ' తో ఒక్క తెలుగు ప్రేక్షకులనే కాదు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, ఒరియా, మరాఠీ భాషా ప్రేక్షకులను కూడా అలరించేందుకు రాబోతున్నారు. 2018లో విడుదలైన 'కేజీఎఫ్'లోనూ తన నట విశ్వరూపాన్ని చూపిన ఉపేంద్ర ఈ చిత్రంతో మళ్లీ అదే స్థాయిలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో సుధీర్ బాబుతో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్.చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, 'కె.జి.ఎఫ్' సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు అందిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. చిత్ర సమర్పకుడు లాంకో శ్రీధర్ మాట్లాడుతూ,'ఉపేంద్ర సినిమాల గురించి, ఆయన పోషించే పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వైవిధ్యంగా నటించే అరుదైన నటుడు ఉపేంద్ర. ఆయన్నుంచి వస్తున్న ఓ వినూత్న చిత్రమే ఇది. ఈ చిత్ర థీమ్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే లుక్ చాలా బాగుందని ఆయన ప్రశంసించడమే మా తొలి విజయంగా భావిస్తున్నాం. ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు తాను ఏదైతే అనుకున్నారో, ఉపేంద్రని ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఎలాగైతే చూడాలనుకుంటున్నారో ఆ రీతిలోనే ప్రజెంట్ చేస్తున్నారు' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఆర్ట్ : శివ కుమార్, ఎడిటర్ : మహేష్ రెడ్డి, సినిమాటోగ్రఫీ : ఎ.జె.షెట్టి, మ్యూజిక్ : రవి బస్రూర్, సమర్పణ : లాంకో శ్రీధర్, నిర్మాణం : శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్, నిర్మాతలు : ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా, రచన - దర్శకత్వం : ఆర్. చంద్రు.