Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నట్టి కుమార్ తనయ నట్టి కరుణ ప్రధాన పాత్రలో 'డిఎస్‌జె' (దెయ్యంతో సహజీవనం) చిత్రం సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి నట్టి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల, నట్టి క్రాంతి నిర్మాతలు. నట్టి లక్ష్మి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్ర మహూర్తపు షాట్‌కి నట్టి క్రాంతి గౌరవ దర్శకత్వం వహించారు. నట్టి లక్ష్మీ కెమెరా స్విచాన్ చేయగా ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు క్లాప్ ఇచ్చారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ, 'ఓ యదార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తనకు జరిగిన అన్యాయానికి ఓ ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే దాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో, అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్గా ఓ పవర్ఫుల్ కాల్ గర్ల్ పాత్రని పోషిస్తోంది. ఆమెతో చేసే ఐటెం సాంగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఏకధాటిగా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపి, తదుపరి షెడ్యూల్‌ను కర్ణాటకలోని మంగళూరులో చేసి చిత్రాన్ని పూర్తి చేస్తాం. గతంలో ఏడాదికి 8 నుంచి 9 సినిమాలు నిర్మించాను. ఇక రాబోయే కాలంలో కూడా ఏడాదికి 15 సినిమాల వరకు నిర్మించాలని నిర్ణయించుకున్నా' అని తెలిపారు. హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ, 'గతంలో నాన్న నిర్మించిన చిత్రాలకు ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నా. ఆ అనుభవం ఈ చిత్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. నాన్న డైరెక్షన్లో ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. నాన్న నా మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే నటిస్తాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించేలా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పారు.
హీరో రాజీవ్ సాలూరు మాట్లాడుతూ, 'నట్టి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. ఆర్జే హేమంత్, స్నిగ్ధ, బాబూ మోహన్, జీవా, రాయల్ హరిశ్చంద్ర (బాహుబలి ఫేం) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎ.ఖుద్దూస్, సినిమాటోగ్రాఫర్: కోటి, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్: వెంకట రమణ, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రేమ్ సాగర్, రమణ రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్: హేమ, ఫైట్ మాస్టర్: అంజి.