Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరణంతో సంగీత ప్రపంచంలో ఓ గొప్ప శకం ముగిసింది. ఐదున్నర దశాబ్దాలుగా తన గానమృతంతో అలరించిన బాలు ఇకలేరనే వార్తను ఇప్పటికీ సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు ప్రముఖులు భావోద్వేగంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు. అభిమాన గాయకుడు శాశ్వతంగా దూరమయ్యారనే వార్త విని, ఆయన కడ చూపు కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకి చేరుకున్న అభిమానుల ఆవేదన మనసుల్ని మెలిపెడుతోంది. 16 భాషల్లో 40 వేలకు పైగా భిన్న పాటలను పాడి ఆబాలగోపాలాన్ని అలరించిన బాలు కోవిడ్ పాజిటివ్ని సైతం జయించినప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యల వల్ల శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. తమిళనాడు ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న బాలు వ్యవసాయ క్షేత్రంలో శనివారం జరిగాయి. స్వరజ్ఞానికి ప్రభుత్వం తరఫున గౌరవ వందనం సమర్పించి గాల్లోకి తుపాకులను పేల్చి పోలీసులు నివాళులు అర్పించారు. అనంతరం వీర శైవ జంగమ సాంప్రదాయం ప్రకారం ఆయన కుటుంబ సభ్యులు మిగిలిన కార్యక్రమాలను నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానుల అశ్రునయనాలతో గాన గంధ్వరుడికి అంతిమ వీడ్కోలు పలికారు. బాలు అంతిమ సంస్కారాలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరై నివాళులర్పించారు. అగ్ర కథానాయకుడు విజరు, ప్రముఖ దర్శకుడు భారతీరాజా, అర్జున్, దేవిశ్రీప్రసాద్, మనో తదితరులు బాలు భౌతికకాయాన్ని కడసారి చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తనను విడిచిపెట్టి వెళ్లిపోయిన స్నేహితుడు బాలు కోసం ఆవేదనాభరిత స్మతి గీతాన్ని పాడి ఇళయరాజా అంకితం ఇచ్చారు.
గాన గంధర్వుడా... గండు కోయిలా...
నీ గీతం ఇవాళ ఎందుకు మూగబోయింది?
గాన గంధర్వుడా... గండు కోయిలా...
నీ గీతం ఇవాళ ఎందుకు మూగబోయింది?
ఒక్కటేగా ఆయుష్షు .. ఇవాళ శాంతించిందా?
శాంతించిందా?
పాడి పాడి.. ప్రేమను పెంచాడు...
పొగిడి పొగిడి... దేవుళ్లను స్తుతించాడు...
సంగీతమనే గగనం... హద్దుల్ని కొలిచాడు
ఉన్న ప్రాణాన్నంతా పాటకే ఖర్చుచేశాడు
యుగాలెన్నిటినో దాటి...
నీ ప్రాణ సవ్వడి
వాయు మండలంలో
జీవంతోనే ఉన్నా..
యుగాలెన్నిటినో దాటి..
నా ప్రాణం సవ్వడం
వాయు మండలంలో
జీవంతోనే ఉన్నా.
కంటి ముందు నిన్ను చూసుకునే వరం దొరుకుతుందా... మళ్లీ ఓ వరం అందుతుందా.. అంజలి... అంజలి... గాన జాబిలికి మౌన అంజలి..
అంజలి... అంజలి..
గాన జాబిలికి మౌన అంజలి..
- ఇళయ రాజా