Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించిన చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు'. ఇందులో హీరో హీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించారు.ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా కరోనా కారణంగా ధియేటర్స్ మూతపడటంతో విడుదలలో జాప్యమైన ఈ చిత్రం ఇప్పుడు ఓవర్సీస్లో ముందుగా విడుదల కానుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు తెలిపారు. 'యు.ఎస్.తో పాటు ఓవర్సీస్లో ఈ నెల 25న ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో అమోజాన్ పైమ్లో విడుదల చేయబోతున్నాం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఓ చిన్న చిత్రం ఓవర్సీస్లో విడుదల కావడం ఇదే మొదటిసారి. ధియేటర్స్ ఓపెన్ కాగానే ఇండియాలోనూ నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. కళాతపస్వి కె.విశ్వనాధ్ ఈ చిత్రాన్ని చూసి దర్శకుడిగా నన్ను ప్రశంసించడం మరచిపోలేని అంశం. అమరావతి, అన్నవరం, అమలాపురం తదితర ప్రాంతాలలోని కనువిందు చేసే పచ్చని లొకేషన్లలో, ప్రేమానురాగాలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రమిది' అని దర్శకుడు శివ నాగేశ్వరరావు అన్నారు. నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, 'ఒక ఫ్యామిలీ పోస్టర్ చూసి చాలా కాలమైంది. సమాజంలోని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని తీసిన కుటుంబ కథా చిత్రమిది' అని అన్నారు.'మంచి అభిరుచిగల దర్శకుడు శివనాగు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. పాటలు చాలా బాగున్నాయి' అని సంగీత దర్శకుడు కోటి చెప్పారు. బెనర్జీ మాట్లాడుతూ,' ఇలాంటి మంచి చిత్రం చేయడం మహదానందంగా ఉంది. ఇందులో నటించడానికి బాగా అవకాశం ఉన్న విలన్ పాత్ర పోషించాను' అని తెలిపారు. ఇదే వేదికపై అతిథులు చిత్రంలోని నాలుగు పాటలను విడుదల చేశారు.